దిశ, ఫీచర్స్ : కాలంతోపాటు మానవ సంబంధాల్లో పలు మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా భార్యా భర్తల బంధంలో ఒకప్పటిలా కేవలం శృంగారం మాత్రమే ప్రాధాన్యత కలిగిన అంశంగా ఉండటం లేదని నిపుణులు చెప్తున్నారు. దాంతోపాటు ఇంకా అనేకం ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా దాపరికాలు, నియంత్రణలు, ఆధిపత్య ధోరణులు లేని జీవితాన్ని ఆస్వాదించాలని నేటి, యువతీ యుకులు కలలు కంటున్నారు. వాటిని సాకారం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. భార్యా భర్తలు లేదా సహజీవనం చేస్తున్న వారు ఎవరైనా.. పరస్పర అవగాహనతో అర్థం చేసుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరాన్ని అందరూ గుర్తిస్తున్నారు.
దంపతుల మధ్య లైంగిక సంబంధంతోపాటు వ్యక్తుల స్వభావం, వ్యక్తిత్వాలు, కోరికలు, నమ్మకాలు, అభిరుచులు, ఆరోగ్యం, హార్మోనల్ ఇష్యూస్ వంటివన్నీ బంధాలు నిలువడంలో, విడిపోవడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఇక ఒకప్పటిలా భర్త మాత్రమే ఉద్యోగం చేయాలని, భార్య చేయకూడదనే పురుషహంకార ధోరణిని ఆధునిక మహిళల్లో చాలా మంది ఒప్పుకోవడం లేదు. పెళ్లి తర్వాత ఇటువంటి పరిస్థితులు ఎదురైతే విడాలకులు ఇవ్వడానికి మొగ్గు చూపుతున్న స్త్రీల సంఖ్య ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతోంది. అలాగే ఇల్లు, సంసారం మగవాడి బాధ్యత కాబట్టి, భర్త మాత్రమే భార్యను సాకాలని, అన్నీ చూసుకోవాలనే ధోరణి కలిగిన మహిళలను కూడా ఆధునిక పురుషులు ఇష్టపడటం లేదు. పెళ్లి తర్వాత ఇటువంటి విషయాల్లో ఒత్తిడి పెరిగితే పురుషులు కూడా విడిపోవడానికి వెనుకాడటం లేదని ఫ్యామిలీ కౌన్సెలింగ్ నిపుణులు అంటున్నారు. అలాగని కపుల్స్ అందరూ ఇలాగే ఉంటున్నారని కూడా భావించాల్సిన అవసరం లేదు. అక్షరాస్యత, అవగాహన స్థాయి, సామాజిక స్పృహ వంటి అంశాలు కూడా దాంపత్య జీవితాన్ని ఫ్రేమ్ చేసుకోవడంలో, బంధాలు నిలువడంలో, విడిపోవడంలో ప్రభావం చూపుతున్నాయి. మొత్తానికి రొమాంటిక్ యాంగిల్ ఒక్కటే ఇక్కడ పనిచేయదని, వ్యక్తిగత, సామాజిక, ఆర్థిక అంశాలు, బరువూ బాధ్యతలు అన్నీ అవసరమేనని నేటి యువతీ యువకులు గ్రహిస్తున్నారు.