ByGanesh
Sat 13th Apr 2024 11:21 AM
ఫేక్.. ఫేక్.. ఎటు చూసినా.. ఎక్కడ చూసినా అంతా ఫేక్..! కాదేదీ ఫేక్ కి అనర్హం అన్నట్లుగా ఏపీ రాజకీయాలు నడుస్తున్నాయి.! ఒకరిపై ఒకరు ఫేకులు సృష్టిస్తూ అధికార వైసీపీ.. ప్రతిపక్ష టీడీపీల మధ్య ప్రతీ పూట రచ్చ రచ్చే జరుగుతోంది. తగ్గేదెలే అని వైసీపీ ఉంటే.. మేము అస్సలే తగ్గము అంటూ టీడీపీ ఉంది. ఆఖరికి మెయిన్ స్ట్రీమ్ మీడియాను సైతం లాగేసి పార్టీలు నానా హంగామా చేసేస్తున్నాయ్. దీంతో సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. ఏది నిజమో.. ఏది అబద్దమో తెలుసుకోలేకపోతున్నారు.
ఏదీ వదలట్లేదు..!
ఎన్నికల సమయంలో సోషల్ మీడియా ఎలా పని చేస్తుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇంతకు మించి మీడియా సైతం ప్రధాన పాత్రే పోషిస్తుంది. ఐతే ఏ పార్టీకి ఆ పార్టీ మీడియా సంస్థలు ఉన్నాయ్ అనుకోండి. వీటినే అను కూల మీడియా అని కూడా ఇప్పుడు అంటున్నారు. కండోమ్ ఫేక్ ప్రచారంతో మొదలై ఇప్పుడు సర్వేలు.. మీడియా బ్రేకింగ్స్ దగ్గర వచ్చాయి. ఇక్కడితో ఆగిందా అంటే అబ్బే ఎప్పుడు ఎక్కడ ఆగుతుందో తెలియని పరిస్థితి. ఇప్పుడు ఎన్నికల సీజన్ కావడంతో పార్టీల ప్రచారం జోరందుకుంది. అంతకుమించి ఫేక్ ప్రచారం సైతం నడిచిపోతోంది. దీంతో పార్టీలకు పార్టీలే కుదేలవుతాయేమో అని అధిపతుల స్వయంగా వివరణ ఇచ్చుకోవలసిన పరిస్థితి. మరోవైపు మీడియా సంస్థలు కూడా బాబోయ్ మేము ఇలాంటి బ్రేకింగ్స్ ప్రసారం చేయలేదు.. నమ్మకండి అని.. ఈ ఫేకునే బ్రేకింగ్ వార్తగా ప్లే చేయాల్సి వస్తోంది.
బ్రేకింగ్ మొదలుకొని ఐబీ వరకూ!
ఇదిగో టీడీపీ ఓడిపోతోంది.. అదిగో వైసీపీ అట్టర్ ప్లాప్ అవుతోంది.. అని ఫలానా మీడియాలో బిగ్ బ్రేకింగ్ వార్తగా వచ్చిందని ఎడిట్ చేయడం.. సోషల్ మీడియాలో వైరల్ చేయడం ఇదో పనిగా పెట్టుకున్నారు రెండు పార్టీల శ్రేణులు. దీనిపై సదరు చానల్స్ యాజమాన్యం స్పందించి.. దీనిపై వార్త పబ్లిష్ చేయడమో.. ప్రసారం చేయడమో తప్పనిసరి అవుతోంది. ఇక ఇదే టైములో ఎక్కడా లేని సర్వే సంస్థలు సైతం పుట్టుకొస్తున్నాయి.. ఇక్కడా అదే సీన్. ఇవన్నీ అటుంచితే టీడీపీకి సపోర్టుగా ఉన్న చానల్స్ లో వచ్చినట్లుగా ఫేక్ వార్తలు వైసీపీ సృష్టిస్తే.. చాలా పెద్ద ట్విస్ట్ అంటూ.. కొన్ని నియోజక వర్గాలకు జగన్ అభ్యర్థులను మారుస్తున్నట్లు సోషల్ మీడియాను సైకిల్ పార్టీ షేక్ చేసింది. రెండు ఆకులు ఎక్కువే తిన్నమంటూ ఏకంగా కేంద్రంలోని ఇంటెలిజెన్స్ బ్యూరో సర్వే వచ్చేసింది.. వైసీపీ రెండోసారి అధికారంలోకి వస్తోంది అంటూ.. రిలీజ్ చేయడం గమనార్హం. సమయం, సందర్భం దొరికితే చాలు.. ఎవరికీ ఎవరూ తగ్గట్లేదు. వీళ్ళు పంతాలు పోయి.. ఇలా రెచ్చిపోతుంటే ప్రజలు ఎవర్ని పట్టించుకోని, ముఖ్యమంత్రి పీఠంపై కూర్చో బెడతారో చూడాలి మరి.
Fake.. Fake.. YCP and TDP are not reduced!:
TDP vs YCP: From braking to IB!