Who is Delhi Capitals batter Jake Fraser McGurk: ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్(LSG)కు ఢిల్లీ(DC) దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. వరుసగా మూడు విజయాలతో మంచి ఊపు మీదున్న లక్నోకు పంత్ సేన ఝులక్ ఇచ్చింది. తొలుత బంతితో లక్నోను తక్కువ పరుగులకే కట్టడి చేసిన ఢిల్లీ… తర్వాత మరో 11 బంతులు మిగిలి ఉండగానే ఆరు వికెట్ల తేడాతో లక్ష్యాన్ని ఛేదించి సాధికార విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న ఢిల్లీ ఇచ్చిన షాక్‌తో.. లక్నో విజయాలకు బ్రేక్ పడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. అనంతరం ఢిల్లీ మరో 11 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో అరంగేట్ర కుర్రాడు జేక్ ఫ్రెసర్ మెక్‌గర్క్ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఢిల్లీ తరపున బరిలోకి దిగిన జేక్ ఫ్రెసర్ మెక్‌గర్క్ కేవలం 35 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సులతో 55 పరుగులు చేశాడు. కృనాల్ పాండ్యా వేసిన ఓవర్‌లో వరుసగా మూడు సిక్సులు కొట్టి సత్తా చాటాడు. అరంగేట్ర మ్యాచ్‌లో ఎదుర్కొన్న రెండో బంతినే స్టాండ్స్‌లోకి పంపి ప్రత్యర్థి జట్లకు హెచ్చరికలు పంపాడు. ఇంతకీ ఎవరీ జేక్ ఫ్రెసర్ మెక్‌గర్క్ అని అందరూ ఆరా తీస్తున్నారు.
ఆసిస్ నుంచే..
ఆస్ట్రేలియాకు చెందిన జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో విక్టోరియాకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 2019లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లోకి జేక్ అడుగుపెట్టాడు. అదే ఏడాది లిస్ట్-ఏ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. బిగ్‌బాష్‌లోనూ అదరగొడుతున్నాడు. బిగ్‌బాష్ లీగ్-2020 సీజన్‌లో మెల్‌బోర్న్ రెనెగేడ్స్ తరపున టీ20ల్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు తన కెరీర్‌లో 37 టీ20 మ్యాచ్‌లు ఆడిన మెక్‌గుర్క్ 645 పరుగులు చేశాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 550 పరుగులు, లిస్ట్-ఏ క్రికెట్‌లో 525 పరుగులు మెక్‌గుర్క్ చేశాడు. గతేడాదిలో లిస్ట్-ఏ క్రికెట్‌లో వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియా దేశీవాళీ వన్డే టోర్నీలో కేవలం 29 బంతుల్లోనే సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లో ఫాస్టెస్ సెంచరీ చేసిన ఆటగాడిగా అతడు రికార్డులకెక్కాడు. ఐపీఎల్-2024 వేలంలో రూ. 50 లక్షల కనీస ధరతో తన పేరును నమోదు చేసుకున్నాడు. ఇంగ్లండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ వ్యక్తిగత కారణాలతో ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ నుంచి తప్పుకోవడంతో మెక్‌గుర్క్‌కు రూ. 50 లక్షల బేస్ ప్రైస్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది.
లక్నోపై గెలుపు ఇలా…
లక్నో విధించిన 168 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన ఢిల్లీకి పర్వాలేదనిపించే ఆరంభం దక్కింది. తొలి వికెట్‌కు… పృథ్వీ షా-వార్నర్ 23 పరుగుల జోడించారు. ఎనిమిది పరుగులు చేసిన వార్నర్‌ను యశ్ ఠాకూర్ బౌల్డ్ చేసి లక్నోకు బ్రేక్ ఇచ్చాడు. కానీ పృథ్వీ షా, జేక్ ఫ్రెసర్ మెక్‌గర్క్ ఢిల్లీని విజయం దిశగా నడిపించారు. రవి బిష్ణోయ్ వేసిన ఏడో ఓవర్‌లో 32 పరుగులు చేసిన పృథ్వీ ఔటయ్యాడు. పృథ్వీ అవుటైనా మెక్‌గర్క్ ధాటిగా ఆడాడు. 13వ ఓవర్‌లో వరుసగా మూడు సిక్సులు కొట్టి మ్యాచ్‌ను ఢిల్లీ వైపునకు తిప్పేశాడు. కేవలం 35 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సులతో మెక్‌గర్క్ 55 పరుగులు చేసి నవీన్ ఉల్ హక్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. రిషబ్ పంత్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 41 పరుగులు చేసి అవుటయ్యాడు. వీరిద్దరి భాగస్వామ్యంతో ఢిల్లీ వైపు పయనించింది. వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో అవుటైనా అప్పటికే లక్ష్యం కరిగిపోయింది. స్టబ్స్, హోప్స్ మిగిలిన పనిని పూర్తి చేశారు.
మరిన్ని చూడండి