Delhi Captain In A Cusp Of One Match Ban In Ipl 2024: ఢిల్లీ క్యాపిటల్స్(DC) కెప్టెన్ రిషభ్ పంత్(Rishabh Pant)పై ఓ మ్యాచ్ సస్పెన్షన్ విధించే అవకాశం కనిపిస్తోంది. స్లో ఓవర్ రేట్ కారణంగా పంత్‌పై ఇప్పటికే రెండుసార్లు జరిమానా పడింది. గత నెల 31న చైన్నైతో జరిగిన మ్యాచ్‌లో, ఈ నెల 3న కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో పంత్‌కు స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమాన విధించారు. శుక్రవారం లక్నోతో జరిగిన మ్యాచ్‌లో కూడా ఢిల్లీ నిర్ణీత సమయానికి వేయాల్సిన ఓవర్ల కంటే తక్కువే బౌల్ చేసింది. 16 ఓవర్ల వరకూ క్యాపిటల్స్ వెనుకబడినా.. చివరి ఓవర్ బౌల్ చేసేలోపు ఆ ఆలస్యాన్ని భర్తీ చేసింది. అంతేకాకుండా అంపైర్‌తో పంత్ వాగ్వాదానికి కూడా దిగాడు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం మూడోసారి స్లో ఓవర్ రేట్‌కు పాల్పడితే ఆ టీమ్ కెప్టెన్‌పై రూ. 30 లక్షల జరిమానాతోపాటు ఓ మ్యాచ్ నిషేధం విధించే అవకాశం ఉంది. పంత్ జరిమానా విషయమై ఐపీఎల్ నిర్వాహకుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు.
నిబంధనలు ఇలా…
తొలిసారి స్లో ఓవర్ రేట్ తప్పిదానికి కెప్టెన్ రూ.12 లక్షలు జరిమానా కట్టాల్సి ఉంటుంది. అదే పొరపాటును మళ్లీ చేస్తే రెట్టింపు జరిమానా అంటే రూ.24 లక్షలు చెల్లించాలి. ఇంపాక్ట్ ప్లేయర్‌తో సహా తుది జట్టులోని 11 మందికి రూ.6 లక్షల చొప్పున లేదా వారి మ్యాచ్ ఫీజ్‌లో 25 శాతం ఏది తక్కువైతే అది.. ఫైన్‌గా విధించడం జరుగుతుంది. ఒకవేళ ఇదే సీజన్‌లో మూడోసారి తప్పిదానికి పాల్పడితే జరిమానా రూ.30 లక్షలతోపాటు ఒక మ్యాచ్ ఆడకుండా నిషేధం విధించే ప్రమాదం లేకపోలేదు. పంత్ జరిమానాకు సంబంధించి ఇప్పటివరకు ఐపీఎల్ కమిటీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఢిల్లీకి గాయాల బెడద
ఐపీఎల్‌లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు గట్టి ఎదురు దెబ్బ తలిగింది. ఇప్పటివరకూ ఆడిన ఆరు మ్యాచుల్లో రెండే విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉన్న ఢిల్లీ… ప్లే ఆఫ్‌కు చేరాలంటే మిగిలిన ప్రతీ మ్యాచ్ కీలకంగా మారింది. ఈ దశలో ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ స్వదేశానికి వెళ్లిపోయాడు. చీలమండ గాయంతో బాధపడుతున్న మిచెల్ మార్ష్.. గాయం తిరగబెట్టడంతో స్వదేశానికి వెళ్లిపోయాడు. చీలమండలో పగులు రావడంతో శస్త్ర చికిత్స కోసం భారత్‌ను వీడాడు. చికిత్స తర్వాత పరిస్థితిని బట్టి తిరిగి ఢిల్లీ జట్టును చేరే అవకాశాలున్నాయి. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో చివరిగా మార్ష్ ఆడాడు. ఇప్పటికే రెండు మ్యాచులకు దూరమైన మార్ష్… ఆడిన మ్యాచుల్లోనూ విఫలమయ్యాడు. టీ20 ప్రపంచకప్‌లో మిచెల్‌ను కెప్టెన్‌గా ప్రకటించే అవకాశాలున్న నేపథ్యంలో అతడు ఐపీఎల్‌లో మిగిలిన మ్యాచ్‌లు ఆడడం సందేహమే. ఢిల్లీకి ఇంకో ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ వేలి గాయంతో బుధవారం గుజరాత్‌తో మ్యాచ్‌కు ఆడేది అనుమానంగా మారింది. లక్నోతో పోరులో వార్నర్‌కు ఈ గాయం కాగా.. వైద్యులు స్కానింగ్ తీయించారు. గాయం తీవ్రతపై ఇంకా స్పష్టత లేదు.
మరిన్ని చూడండి