దిశ, ఫీచర్స్ : బర్రెలక్క అలియాస్ శిరీష అంటే ఇప్పుడు దాదాపు తెలియనివారంటూ ఎవరూ ఉండకపోవచ్చు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఎంతోమంది ఊహించని రీతిలో సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. అలాంటి వారిలో బర్రెలక్క కూడా ఒకరు. డిగ్రీ చదివాక ఉద్యోగ ప్రయత్నం చేసినా రాకపోవడంతో బతుకు దెరువుకోసం బర్రెలను కాసుకుంటున్నానంటూ ఆమె చేసిన వీడియోలు వైరల్‌గా మారి, సోషల్ మీడియాను షేక్ చేశాయి.
సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న బర్రెలక్క ఆ తర్వాత ఏకంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి అందరి దృష్టినీ ఆకట్టుకుంది. నిరుపేద కుటుంబంలో పుట్టి పెరిగిన బర్రెలక్క ధైర్యంగా అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతోందంటూ ఎంతోమంది ప్రజలు, ప్రముఖులు, సెలబ్రిటీలు ఆమెను ప్రశంసించారు. ఆర్థికంగా, హార్థికంగా సహకరించారు. ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ఆమె ధైర్యం కోల్పోలేదు. ఎంపీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తానని అప్పట్లో ప్రకటించింది. ఇలా.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి దాడులు, విమర్శలు ఎదుర్కొన్నా వెనుకడుగు వేయకుండా మరింత పాపులర్ అయింది బర్రెలక్క.
ఇటీవల బర్రెలక్క పెళ్లి కూడా చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియోలు కూడా తన అభిమానులు, ఫాలవర్స్‌తో ఎప్పటికప్పుడు పంచుకుంది. ఇదిలా ఉండగా తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఫొటోలు, వీడియోలను ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకోగా తీవ్ర విమర్శలు, ట్రోల్స్ ఎదుర్కొంటున్నది. ఇంతకీ ఏం జరిగిందంటే.. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆమె అంబేద్కర్ చిత్రపటానికి పూజ చేసింది. ఇంటివద్దు, చుట్టు పక్కల పరిసరాల్లో దొరికే పూలతో మాల అల్లి ఫొటోకు వేసి, కొబ్బరి కాయ కొట్టింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ‘ఎంపీ అభ్యర్థివై ఉండి ఒక పూలమాల కొనుక్కోవడానికి డబ్బులు లేవా?’’ అంటూ కొందరు కామెంట్స్ పెడుతుండగా, మరి కొందరు ఏంది బర్రెలక్క ఇది ఎన్నికల్లో పోటీజేస్తవ్ గానీ పైసల్లేవా? అంటూ వ్యటకారంగా స్పందిస్తున్నారు. ఇంకొందరు ‘ఘనంగా పెళ్లి చేసుకున్న బర్రెలక్కవద్ద పూల దండకు పైసల్లేవేమో డొనేషన్ ప్లీజ్’’ అంటూ ట్రోల్ చేస్తున్నారు.