ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈసారి గెలిచి.. రెండోసారి సీఎం పీఠంపై కూర్చోవాల్సిందేనని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఊహకందని వ్యూహాలు రచిస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టగా.. వైసీపీ మాత్రం ఒంటరిపోరు చేస్తోంది. ఇప్పటి వరకూ విమర్శలు, ప్రతివిమర్శలూ.. బస్సు యాత్రలు, బహిరంగ సభలూ అన్నీ ఓకే కానీ గెలుపోటములను నిర్ణయించేది.. మిగిలిండేది వన్ అండ్ ఓన్లీ మేనిఫెస్టో మాత్రమే. ఇంతవరకూ చిన్నగా లీకులు ఇస్తున్నాయో తప్ప ఏ పార్టీ పూర్తిగా మేనిఫెస్టోను ప్రకటించలేదు. వైసీపీ ప్రకటించాక రిలీజ్ చేద్దామని కూటమి.. కూటమి కథేంటో తెలిశాక రిలీజ్ చేద్దామని వైఎస్ జగన్ లెక్కలేసుకుంటున్నారు.
వీటికే ప్రాధాన్యత!
2019 ఎన్నికల్లో చెప్పిన.. చెప్పని హామీలను సైతం నెరవేర్చిన ఘనత వైఎస్ జగన్ రెడ్డిది.. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా జగమెరిగిన సత్యమేనని వైసీపీ నేతలు చెప్పుకుంటూ ఉంటారు. ముఖ్యంగా నవరత్నాలు మేనిఫెస్టో ప్రకటించి.. అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే అన్నింటినీ నెరవేర్చేశారు. దీంతో జగన్ చెప్పాడంటే చేస్తాడంతే అనే ఒక నమ్మకం ప్రజల్లో పదిలంగా ఉండిపోయింది. గతం సరే.. ఈసారి జగన్ ఏం ప్రకటించబోతున్నారు..? ఏమేం ఉంటాయనేది కాస్త కూడా లీకులు ఇవ్వట్లేదు. కానీ.. వైసీపీకి, వైఎస్ జగన్‌కు అత్యంత సన్నిహితుల నుంచి వస్తున్న సమాచారం మేరకు ఈసారి జగన్ కీలక హామీలనే ఇవ్వబోతున్నారని తెలిసింది. రైతు రుణమాఫీ, డ్వాకా రుణ మాఫీ 2024 మేనిఫెస్టోలో జగన్ పెట్టబోతున్నారట.
ఇంకా ఏమేం ఉంటాయ్!
కాగా.. గతంలో రుణమాఫీ అనే ప్రస్తావనే చేయని జగన్ ఈసారి దాన్నే టచ్ చేయాలని భావిస్తున్నారట. రుణమాఫీ అని చెప్పి తీరాల్సిందేనని.. సొంత పార్టీ నేతల నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిడి వస్తోందట. దీంతో జగన్ ఒప్పుకోక తప్పట్లేదట. ఇదే జరిగితే కూటమి పని గోవిందా అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. ముందుగా.. మహిళలకు సిలిండర్లు, బస్సు ప్రయాణంపై ఆలోచించినప్పటికీ.. డ్వాక్రా రుణమాఫీ చెబితే చాలని వైసీపీ గట్టిగా అనుకుంటోందట. ఇక ఎలాగో ఇప్పుడున్న నవరత్నాల్లో ప్రతి పథకానికి ఇప్పటి వరకూ ఉన్న నగదు కంటే ఎక్కువగానే ఇవ్వాలని కూడా యోచిస్తోందట వైసీపీ. అయితే.. వైసీపీ మేనిఫెస్టో ప్రకటన తర్వాతే కూటమి రిలీజ్ చేయాలని.. జగన్ ఏమేం చెబుతారో చూసి ఇక హామీలు ఇవ్వాలని టీడీపీ, జనసేన, బీజేపీలు భావిస్తున్నాయట. ఎవరి మేనిఫెస్టో హిట్.. ఎవరిది ఫట్ అవుతుందనేది తెలియాలంటే మే-13 పోలింగ్, జూన్-04 ఫలితాల వరకూ వేచి చూడాల్సిందే మరి.