ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు రవి కిషన్ చిక్కుల్లో పడ్డారు. రవి కిషన్ తనను రహస్యంగా పెళ్ళి చేసుకున్నారంటూ ఓ మహిళ.. తన కూతురితో కలిసి మీడియా ముందుకు వచ్చింది.
భోజ్‌పురి, హిందీ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న రవి కిషన్.. ‘రేసుగుర్రం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువయ్యాడు. అలాగే రాజకీయాల్లోనూ రాణిస్తున్నాడు. ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్‌పూర్ నుంచి 2019లో బీజేపీ తరఫున ఎంపీగా పోటీ చేసి గెలిచాడు. ఇప్పుడు అదే స్థానం నుంచి ఎన్నికల బరిలో నిలిచాడు.
అయితే, ఎన్నికల ప్రచారంతో బిజీగా ఉన్న రవి కిషన్ కి ఊహించని షాక్ తగిలింది. లక్నోకు చెందిన అపర్ణా ఠాకూర్ అనే మహిళ.. 1996లో రవి కిషన్ తో తనకు రెండో పెళ్లి జరిగిందని, తమకు 15 ఏళ్ళ కూతురు కూడా ఉందని తెలిపింది. తాజాగా కూతురితో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించిన ఆమె.. తమ బిడ్డను రవి కిషన్ కూతురిగా స్వీకరించకపోతే తాను న్యాయ పోరాటం చేస్తానని హెచ్చరించింది. ఈ విషయంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తనకు న్యాయం చేయాలని కోరింది. ఈ సందర్భంగా అపర్ణ కూతురు మాట్లాడుతూ.. రవి కిషన్ తన తండ్రి అనే విషయం తెలియక చాలా కాలం అంకుల్ అని పిలిచానని, ఆయన తన తండ్రి అనే విషయం ఈ మధ్యనే తెలిసిందని వెల్లడించింది.