కన్నడ ఇండస్ట్రీ మాత్రమే కాదు, భారతీయ చలనచిత్ర పరిశ్రమ కూడా సిగ్గుపడి తలదించుకునే పరిస్థితిని హీరో దర్శన్ తీసుకొచ్చాడు. ఇంతకుముందెన్నడూ లేని విధంగా ఒక దారుణానికి పాల్పడ్డ దర్శన్‌ను అతని అభిమానులే తీవ్ర పదజాలంతో విమర్శిస్తున్నారు. హీరోలను ఎంతగానో ఆరాధించే అభిమానుల పట్ల మీ తీరు ఇలా ఉంటుందా అంటూ జరిగిన ఘటన చూసి షాక్ అవుతున్నారు. జూన్ 8న హత్యకు గురైన రేణుకా స్వామి కేసులో హీరో దర్శన్, అతని ప్రియురాలు పవిత్రగౌడతోపాటు మరో 13 మంది అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు బయటకు వచ్చాయి.
ఆల్రెడీ పెళ్లి అయినా మరొకరితో సహజీవనం చేయడం లేదా పెళ్లి చేసుకోవడం అనేది సినిమా తారల విషయంలో సర్వసాధారణం అయిపోయింది. రేణుకా స్వామి హత్య కేసులో ప్రధాన నిందితులైన దర్శన్, పవిత్రలకు సెపరేట్‌గా ఫ్యామిలీలు ఉన్నాయి. కానీ, కొన్ని సంవత్సరాలుగా ఇద్దరూ కలిసే ఉంటున్నారు. ఇది దర్శన్ అభిమానులకు రుచించలేదు. ఈ విషయంపై అభిమానులు తరచూ పవిత్రగౌడను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతూ ఉంటారు. కొందరు ఆమెను తిడుతూ వార్నింగ్ కూడా ఇస్తుంటారు. అయితే ఈ విషయంలో రేణుకా స్వామికి మాత్రమే ఇలా జరగడం అందర్నీ బాధిస్తున్న అంశం.
సోషల్ మీడియాలో రేణుకా స్వామి పదే పదే తనను వేధిస్తున్నాడంటూ దర్శన్‌కు చెప్పింది పవిత్రగౌడ. సినిమాల్లో హీరోలా ఉండే దర్శన్.. రియల్ లైఫ్‌లో మాత్రం విలన్‌గా మారిపోయాడు. రేణుకా స్వామిని కిడ్నాప్ చేసి.. పవిత్ర కళ్ళముందే దారుణంగా హింసించాడు. అతని ప్రైవేట్ పార్టులపై కొట్టడం వల్ల అతను చనిపోయాడు. ఈ కేసును కర్ణాటక పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. విచారణను వేగవంతం చేశారు. రేణుకా స్వామిని కిడ్నాప్ చేసి ఒక షెడ్‌కి తరలించడంలో కీలక పాత్ర పోషించిన డ్రైవర్ అప్రూవర్‌గా మారి లొంగిపోయాడు.
ఇదిలా ఉంటే.. అంతా జరిగిపోయిన తర్వాత పవిత్రగౌడ ఇప్పుడు కన్నీరు మన్నీరవుతూ నిజాల్ని ఒప్పుకుంటోంది. అభిమాని విషయంలో పోలీసుల్ని ఆశ్రయించకుండా దర్శన్‌కు చెప్పి చాలా తప్పు చేశానని బాధపడుతోంది. ఈ ఘటనను అభిమానులు చాలా సీరియస్‌గా తీసుకున్నారు. దర్శన్ మీద సోషల్ మీడియాలో చాలా దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. ‘నేను నీ ఫ్యాన్‌ని అని చెప్పుకోవడానికే చాలా సిగ్గుగా ఉంది’, ‘ఇకపై నిన్ను ఫాలో అవ్వను’, ‘దర్శన్ కన్నడ సల్మాన్ ఖాన్’, ‘నాకు తెలిసి ఇంతటి దారుణం ఏ హీరో చెయ్యలేదు’ అంటూ దర్శన్‌పై ఫైర్ అవుతున్నారు అభిమానులు.