జనసేనాని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆంధ్రప్రదేశ్ కి ఉప ముఖ్యమంత్రి కావడంతో మెగా కుటుంబం ఎంతో ఆనందంగా ఉంది. పవన్ కి శుభాకాంక్షలు తెలుపుతూ తమ సంతోషాన్ని పంచుకోవడంతో పాటు.. ఆయనకు బహుమతులు కూడా ఇస్తున్నారు. ఇప్పటికే వదిన సురేఖ.. పవన్ కి ఖరీదైన పెన్ ను గిఫ్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా పవన్ కి ఓ గిఫ్ట్ ఇచ్చాడు.
మేనమామ పవన్ కళ్యాణ్ అంటే సాయి తేజ్ కి ఎంతో అభిమానం. ఆ అభిమానాన్ని మరోసారి చాటుకున్నాడు. లెగో స్టార్ వార్స్ సెట్ ను పవన్ కి గిఫ్ట్ గా ఇచ్చాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఫొటోను షేర్ చేసిన మెగా మేనల్లుడు.. “నాకు స్టార్ వార్స్ మరియు లెగోలను పరిచయం చేసిన వ్యక్తి.. నా ప్రియమైన జేడీ మాస్టర్ & డిప్యూటీ సీఎంకి.. నా చిన్ననాటి రోజులను తిరిగి పొందేందుకు, ఆయనలోని చైల్డ్ కోసం బహుమతిని ఇచ్చే అవకాశం నాకు ఇప్పటికి లభించింది.” అంటూ రాసుకొచ్చాడు.