INDW vs SAW: మహిళల క్రికెట్ (Women Cricket)లో సంచలనాలు నమోదయ్యాయి. భారత్-దక్షిణాఫ్రికా(IndW Vs SaW) మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌లో గతంలో ఎప్పుడూ లేని విధంగా రికార్డులు నమోదయ్యాయి. వన్డే క్రికెట్‌లో తొలిసారి ఒకే మ్యాచ్‌లో నాలుగు సెంచరీలు నమోదయ్యాయి. అంతేనా తొలుత బ్యాటింగ్ చేసిన భారత ఉమెన్స్ జట్టు 325 పరుగులు చేసినా…. చివరి బంతి వరకూ విజయం కోసం పోరాడాల్సి వచ్చింది. ప్రేక్షకులను తీవ్ర ఉత్కంఠకు గురి చేసిన ఈ మ్యాచ్‌లో భారత్ చివరి బంతికి విజయం దక్కించుకుని ఊపిరి పీల్చుకుంది. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో టీమిండియా ఉమెన్స్ జట్టు కైవసం చేసుకుంది. అయినా భారీ లక్ష్యం కళ్ల ముందు కనపడుతున్నా చివరి బంతి వరకూ పోరాడిన దక్షిణాఫ్రికా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఈ మ్యాచ్‌లో మొత్తం 646 పరుగులు నమోదవ్వడం మరో రికార్డు.
మంధాన, హర్మన్‌ప్రీత్ శతకాలు
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఉమెన్స్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 325 పరుగుల భారీ స్కోరు చేసింది. దీంతో టీమిండియా విజయం తేలికే అని అంతా అనుకున్నారు. కానీ దక్షిణాఫ్రికా మహిళలు అద్భుతంగా పోరాడారు. భారత జట్టులో స్మృతి మంధాన(Smriti mandhana) 120 బంతుల్లో 18 ఫోర్లు, రెండు సిక్సర్లతో 136 పరుగులు చేసింది. బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై భారత బ్యాటర్లు చెలరేగిపోయారు. హర్మన్‌ప్రీత్ కౌర్( Harmanpreet Kaur) కూడా శతకంతో విరుచుకుపడింది. హర్మన్-మంధాన కలిసి భారీ భాగస్వామ్యం నమోదు చేశారు. వీరిద్దరూ కలిసి 136 బంతుల్లో 171 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మొదటి 48 బంతుల్లో కేవలం 31 పరుగులే చేసిన మంధాన… 103 బంతుల్లో తన ఏడో వన్డే సెంచరీని పూర్తి చేసుకుంది. మంధాన మహిళల వన్డేల్లో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు సాధించిన తొలి భారత బ్యాటర్‌గా రికార్డు సృష్టించింది. హర్మన్‌ప్రీత్ తొలుత 24 బంతుల్లో 24 పరుగులు చేసి ఆ తర్వాత వేగంగా బ్యాటింగ్ చేసింది. అదే ఊపు కొనసాగించిన హర్మన్‌ప్రీత్ దాదాపు రెండేళ్ల తర్వాత ఆరో వన్డే సెంచరీని పూర్తి చేసుకుంది. చివరి పది ఓవర్లలో మంధాన-హర్మన్‌ప్రీత్ 118 పరుగులు చేసి టీమిండియాకు భారీ స్కోరు అందించారు. చివర్లో రిచా ఘోష్ 13 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 25 పరుగులు చేసింది. హర్మన్ 88 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 103 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. దీంతో టీమిండియా ఉమెన్స్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 325 పరుగుల భారీ స్కోరు చేసింది.
చివరి ఓవర్ వరకూ పోరాటం
326 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా… టార్గెట్‌ను ఛేజ్ చేయడం కష్టమే అనిపించింది. కానీ పోరాటానికి మారుపేరైన దక్షిణాఫ్రికా మరోసారి అదే పనిచేసింది. ఓ దశలో 3 వికెట్ల నష్టానికి 67 పరుగులే చేసి ప్రొటీస్…. భారీ తేడాతో ఓడిపోతుందని అనిపించింది. కానీ వోల్వార్డ్-మారిజాన్ కాప్ జోడీ 184 పరుగుల భాగస్వామ్యంతో దక్షిణాఫ్రికాను పోటీలో నిలిపింది. లూరా వొల్వార్డ్ 135 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సులతో 135 పరుగులు చేసి ప్రొటీస్‌ను పోరాటంలో నిలిపింది. మారిజాన్ కాప్ 94 బంతుల్లో 11 ఫోర్లు, మూడు సిక్సర్లతో 114 పరుగులు చేసింది. వీరిద్దరూ పోరాటంతో దక్షిణాఫ్రికా మహిళల వన్డే క్రికెట్‌లో భారీ లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించింది. చివరి 15 ఓవర్లలో 148 పరుగులు కావాల్సి ఉండగా, దక్షిణాఫ్రికా ఆ రన్‌రేట్‌ను కూడా అందుకుంటూ ముందుకు సాగింది.
చివరి ఓవర్ ఇలా…
చివరి ఓవర్‌లో దక్షిణాఫ్రికా విజయానికి పది పరుగులు చేయాల్సి వచ్చింది. పూజా వస్త్రాకర్ కేవలం ఆరు పరుగులే ఇవ్వడంతో టీమిండియా ఊపిరి పీల్చుకుంది. మొదటి రెండు బంతుల్లో ఐదు పరుగులు వచ్చాయి. ఆ తర్వాత వస్త్రాకర్ రెండు వికెట్లు తీయడంతో ప్రొటీస్ పోరాటం ముగిసింది. ఆఖరి బంతికి విజయానికి అయిదు పరుగులు కావాల్సి ఉండగా స్లో డెలివరీతో పూజా పరుగులు ఏమీ ఇవ్వలేదు. దీంతో భారత్ విజయం సాధించింది.
మరిన్ని చూడండి