దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం చాలామంది కళ్లకు సంబంధించి ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చూపు మందగించడం, కళ్లు మసకబారడం వంటివి సాధారణంగా వచ్చే సమస్యలు. అయితే ఈ సమస్య అందరిలో ఒకేలా ఉండకపోవచ్చు. కొంతమంది తమ కంటిచూపులో ఆకస్మాత్తుగా హెచ్చు తగ్గులను అనుభవిస్తుంటారు. అంటే ఒకప్పుడు బాగా కనిపించిన దృశ్యాలు అకస్మాత్తుగా అంత క్లారిటీగా కనిపించకపోవడం, కళ్లల్లో ఏదో నలతగా ఉండటం వంటివి ఇబ్బందులు కలగవచ్చు. కొన్నిసార్లు ఐ సైట్ (Eye Sight)వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది.
తాత్కాలిక సమస్యల ప్రభావం
కంటిచూపు మందగించడం అనే సమస్య ఒక్కసారి వస్తే అలాగే ఉండిపోతుందా?, తగ్గిపోయి మునుపటిలా ఉండే అవకాశం లేదా? అనే సందేహాలు పలువురిలో వ్యక్తం అవుతుంటాయి. అయితే ఇది ఏర్పడిన సమస్యను, జీవన శైలిని బట్టి కూడా ఉంటుందని కంటివైద్యులు చెప్తున్నారు. కంటి చూపులో తేడాలు లేదా హెచ్చు తగ్గులు వంటివి సాధారణంగా వయస్సు, ఆరోగ్య పరిస్థితులు, జీవనశైలి, పర్యావరణ కారకాల ద్వారా సంభవిస్తుంటాయి. అట్లనే కొందరు తరచుగా సిస్టమ్స్‌పై గడిపే సందర్భంగా అధిక లైటింగ్ వల్ల కళ్లల్లో తేమ తగ్గడం, పొడిబారడం వంటి మార్పులు కంటి చూపు మందగించడానికి కారణం అవుతుంటాయి. అలాంటప్పుడు వెంటనే ప్రిస్ర్కిప్షన్ గ్లాసులు, కాంటాక్ట్ లెన్స్, స్పెర్ట్స్ వంటివి కంటి చూపులో టెంపరరీ మెరుగుదలకు దోహదం చేస్తాయి. అయితే ఇవి కళ్లను ఆరోగ్యపరంగా శాశ్వతంగా మెరుగు పర్చకపోవచ్చు.
ఆహారాలు, పోషకాలతో పరిష్కారం?
కంటి చూపును మెరుగు పర్చుకోవడానికి, దృష్టిని లోపాలను నివారించడానికి తాత్కాలిక వైద్య పరిస్థితులు, చర్యలకంటే కూడా లోతుగా వాటి ఆరోగ్యం కాపాడటం అనేది చాలా ముఖ్యమని నిపుణులు చెప్తున్నారు. అందుకోసం ఏ మాత్రం దృష్టిలోపం ఏర్పడినా, చూపులో హెచ్చు తగ్గులు కనిపించినా కంటి పరీక్షలు చేయించుకోవాలి. ప్రారంభంలో గుర్తిస్తే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, వివిధ పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవడం, కళ్లను హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం, అధిక కాంతి, యూవీ కిరణాల ఫోకస్‌కు గురికాకుండా చూసుకోవడం వంటివి మళ్లీ కంటిచూపు మెరుగుదలలో కీలకపాత్ర పోషిస్తాయి. అయితే ఇది వృద్ధాప్యంలో సాధ్యం కాకపోవచ్చు.