వ్యక్తిగత సాధన, ధర్మరక్షణ.. ఈ రెండూ లక్ష్యాలను ఎంచుకుని యోగమూ, ధర్మమూ సవ్యంగా సాగడానికి భక్తి రసోన్మత్త స్థితికి తీసుకెళ్లే ప్రార్ధనల గ్రంధాలను ప్రచురించి.. ఈ చక్కని గ్రంధాల మధ్యలో అద్భుత కధలను, అందమైన వ్యాఖ్యానాలను రచించి లక్షలకొలదీ భక్త పాఠకుల్ని ఆకట్టుకోవడంలో అగ్రస్థానంలో ముందుకెళుతున్న ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ జ్ఞాన మహా యజ్ఞ కేంద్రం (Gnana Maha Yagna Kendram) సంస్థాపక కార్యదర్శి, ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ (Puranapanda Srinivas)తో కృష్ణా జిల్లాకు చెందిన కొందరు తెలుగుదేశం పార్టీ శ్రేణులు విజయవాడలో సమావేశమవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu), శ్రీమతి భువనేశ్వరి దంపతులు ఈ రాష్ట్రానికి మహాద్భుతమైన, సమర్ధవంతమైన పాలన అందిస్తారని, అందివ్వాలని కోరుతూ.. ప్రార్ధిస్తూ ఇటీవల కిమ్స్ హాస్పిటల్స్ చైర్మన్, మాజీ శాసన సభ్యులు బొల్లినేని కృష్ణయ్య (Bollineni Krishnaiah) ‘జయ జయోస్తు’, ‘నారసింహో … ఉగ్రసింహో’… అనే రెండు రమణీయ గ్రంధాలను బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన కనకదుర్గమ్మ సన్నిధానంలో మహాత్ములైన చాగంటి కోటేశ్వరరావు వంటి సనాతనధర్మతేజస్సుతో ఆవిష్కరించడం ఎంతో వైభవంతో వేలకొలది భక్తుల్ని ఆకర్షించింది. ఈ రెండు ఆర్ష భారతీయ దివ్య గ్రంధాలకూ పురాణపండ శ్రీనివాస్ రచనా సంకలనకర్త కావడం.. ఈ గ్రంధాలు ఎంతో సౌందర్యంతో రూపు దిద్దుకోవడం ప్రత్యేకంగా పేర్కొనాలి.
ఇప్పుడు తెలుగుదేశం శ్రేణుల కోసం రెండు పవిత్ర ప్రత్యేక గ్రంధాలను రూపు దిద్దడంలో తలమునకలయ్యారు పురాణపండ శ్రీనివాస్. ఈ అపురూప దైవీయ చైతన్యపు గ్రంధాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చిత్రాలను ప్రచురించాలని కోరినట్లు సమాచారం. ఆగస్ట్ పదిహేనవ తేదీన అమరావతి, విజయవాడలలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఈ అద్భుత గ్రంధాలను ఉచితంగా అందించనున్నట్లు సమాచారం. అయితే.. ప్రత్యేకంగా వేరే గ్రంధాలను రూపొందించడంకన్నా, ఇటీవల మంగళగిరి లక్ష్మీ నరసింహ దేవస్థానంలో, విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఆకట్టుకున్న ‘జయ జయోస్తు’, ‘నారసింహో … ఉగ్రసింహో’.. రెండు భక్తి రసభరిత గ్రంధాలనే బహూకరించడానికి తెలుగుదేశం శ్రేణులు పురాణపండ శ్రీనివాసతో ఖరారు చేసుకున్నట్లు తెలిసింది.
కిమ్స్ హోపిటల్స్ చైర్మన్ , మాజీ శాసన సభ్యులు బొల్లినేని కృష్ణయ్య ఈ రెండు గ్రంధాలను సమర్పించిన విషయం భక్త పాఠకులకు ఎరుకే. అమరావతి, విజయవాడలలోని ప్రభుత్వ అధికారుల, ఉద్యోగులకు మాత్రమే కాకుండా భారతీయ జనతాపార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీలలోని ముఖ్యులకు కూడా బహూకరించడానికి సుమారు ఇరవై ఐదువేల ప్రతులు ముద్రిస్తున్నట్లు సమాచారం.