Rohit Sharma revealed the strategy after match: టీ 20 ప్రపంచకప్ సూపర్ ఎయిట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై టీమిండియాకు ఘన విజయం అందించిన రోహిత్ శర్మ(Rohit Sharma) కంగారులను తన పదునైన షాట్లతో కంగారెత్తించాడు. ఆస్ట్రేలియా( Australia) బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపించాడు. ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా సెమీస్ చేరాలంటే గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియాకు ఘన విజయాన్ని అందించాడు. అయితే ఆస్ట్రేలియా గేమ్ ప్లాన్ మార్చుకోవడం వల్లే తాను కూడా గేమ్ ప్లాన్ మార్చానని రోహిత్ తెలిపాడు.
గేమ్ ప్లాన్ మార్చా…
ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో గాలి అధిక ప్రభావం చూపిందని… దానికి తగ్గట్లే తాను కూడా గేమ్ ప్లాన్ చేసుకున్నానని రోహిత్ తెలిపాడు. గాలి అధికంగా వీస్తుండడంతో తాను కూడా బ్యాటింగ్‌ను సర్దుబాటు చేసుకుని భారీ షాట్లు ఆడానని తెలిపాడు. కోహ్లి(Kohli) డకౌట్ అయినా ధాటిగా ఆడిన రోహిత్ కేవలం 41 బంతుల్లోనే 92 పరుగులు చేసి మ్యాచ్‌ను భారత్ వైపునకు తిప్పాడు. ఇందులో ఏడు బౌండరీలు, ఎనిమిది సిక్సర్లు ఉన్నాయి. రోహిత్ ఆఫ్ సైడ్‌లో కొన్ని అద్భుతమైన భారీ షాట్లు ఆడాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో కవర్స్ మీదుగా కొట్టిన రెండు సిక్సర్లయితే దేనికదే ప్రత్యేకం. రోహిత్ విధ్వంసంతో టీమిండియా 205 పరుగుల భారీ స్కోరు చేసింది. అయితే ఈ మ్యాచ్‌లో కంగారు బౌలర్లు తమ గేమ్ ప్లాన్ మార్చారని… బలంగా వీస్తున్న గాలులను తమ బౌలింగ్‌కు అనుకూలంగా మార్చుకోవాలని అనుకున్నారని రోహిత్ తెలిపాడు. అందుకే కంగారుల బౌలింగ్‌లో భారీ షాట్లు ఆడాల్సి వచ్చిందని తెలిపాడు. కోహ్లీ కానీ తాను కానీ ఇద్దరిలో ఒకరం భారీ స్కోరు చేయాలని భావించామని… కోహ్లీ త్వరగా అవుట్ కావడంతో ఆ బాధ్యత తాను తీసుకున్నట్లు రోహిత్ తెలిపాడు. బలమైన గాలి వీస్తుండడంతో ఆస్ట్రేలియా బౌలింగ్ ప్రణాళికను మార్చుకుందని… గాలికి వ్యతిరేకంగా బౌలింగ్ చేసిందని రోహిత్ తెలిపాడు. అలా బౌలింగ్ చేస్తున్నప్పుడు ఆఫ్‌సైడ్ భారీ షాట్లు ఆడాలని తాను నిర్ణయించుకున్నానని రోహిత్ తెలిపాడు.
భారీ షాట్లు తప్పవు
కంగారు బౌలర్లు తెలివైనవారని, అలాంటప్పుడు అన్ని వైపులా భారీ షాట్లు ఆడాల్సిందేనని హిట్‌మ్యాన్ తెలిపాడు. సెయింట్ లూసియాలో 200 పరుగులు మంచి స్కోరని తమకు తెలుసని… కానీ గాలి బలంగా వీస్తున్న ఇలాంటి మైదానాల్లో ఆడుతున్నప్పుడు ఏదైనా సాధ్యమే అని కానీ తాము పరిస్థితులను బాగా ఉపయోగించుకున్నామని రోహిత్ తెలిపాడు. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఈ మ్యాచ్‌లో బాగా రాణిస్తాడని తమకు ముందునుంచి నమ్మకం ఉందని కూడా హిట్‌మ్యాన్ తెలిపాడు. కుల్దీప్ నాలుగు ఓవర్లలో 2 వికెట్లు తీసి 24 పరుగులు ఇచ్చాడు. కుల్దీప్ బలాన్ని తాము అర్థం చేసుకున్నామన్న రోహిత్… అవసరమైనప్పుడు దానిని ఉపయోగించాలని తమకు తెలుసని అన్నాడు. కుల్‌దీప్ విండీస్ పిచ్‌లపై కీలక పాత్ర పోషిస్తాడని తమకు తెలుసని తెలిపాడు. ఈ మ్యాచ్‌లో ‘టెంపో’నే వచ్చే మ్యాచ్‌లో కొనసాగించడంపైనే దృష్టి పెడతానని… సెంచరీ మిస్ అయినందుకు బాధపడటం లేదని రోహిత్ స్పష్టం చేశాడు.
మరిన్ని చూడండి