ఉత్కంఠ భరితంగా సాగుతుందనుకుని అందరూ ఊహించిన భారత్ వర్సెస్ ఇంగ్లండ్ సెమీ ఫైనల్ మ్యాచ్ ఏకపక్షంగా మారిపోయింది. టీ20 వరల్డ్ కప్ లో ఫైనల్ కి వెళ్లాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన నాకౌట్ మ్యాచ్ లో ముందు బ్యాటింగ్ చేసిన భారత్ 171పరుగులు చేసి 172పరుగుల టార్గెట్ ఇంగ్లండ్ ముందుంచింది. కెప్టెన్ జోస్ బట్లర్ తో మొదలుపెడితే ఫిల్ సాల్ట్, బెయిర్ స్టో, హ్యారీ బ్రూక్, లివింగ్ స్టోన్, మొయిన్ అలీ, శామ్ కర్రన్ ఇలా చాంతాడంత లిస్టు ఉన్న ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్ ముందు ఇది సరిపోతుందా అనే డౌట్ అందరికీ ఉంది. బ్యాటింగ్ కు చాలా టఫ్ గా ఉండే ఆ పిచ్ మీద 165పరుగులు కొట్టినా ఎక్కువే అని రికార్డులు చెబుతున్నా ఎందుకో ఎక్కడో ఓ రకమైన ఆందోళన. 2022 వరల్డ్ కప్ లో ఎదురైన పదివికెట్ల పరాభావమే మళ్లీ వెక్కిరిస్తుందా అని. అలాంటి టైమ్ లో బాపు మనల్ని ఆదుకున్నాడు. అక్షర్ పటేల్ ను టీమిండియా క్రికెటర్లంతా బాపూ అని పిలుస్తారు. అక్షర్ పటేల్ ది కూడా గుజరాత్ కావటం..చూడటానికి గాంధీజీ లాంటి ఆహార్యంతో ఉండటం అన్నీ అతనికి ఆ ముద్దు పేరును ఇచ్చాయి. అయితే ఆ బాపు తెల్లదొరలను అహింసతో తరిమేసి దేశానికి స్వాతంత్ర్యం ఇస్తే ఈ బాపు తన స్పిన్ బౌలింగ్ తో అదే తెల్లదొరలకు చెక్ పెట్టాడు. వేసిన నాలుగు ఓవర్లలో మొదటి మూడు ఓవర్లు ప్రతీ మొదటి బంతికి వికెట్ తీయటం ఈ మ్యాచ్ లో అక్షర్ పటేల్ స్పెషాలిటీగా చెప్పుకోవాలి. అత్యంత ప్రమాదకర ఆటగాడు కెప్టెన్ జోస్ బట్లర్ ను నాలుగో ఓవర్ లో నే బౌలింగ్ కి వచ్చి మొదటివికెట్ గా తీసుకున్న అక్షర్ పటేల్, ఆ తర్వాతి ఆరో ఓవర్ బౌలింగ్ చేసి మొదటి బంతికే బెయిర్ స్టోను బలి తీసుకున్నాడు. మళ్లీ ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్ బౌలింగ్ చేసి మొదటి బంతికే మొయిన్ అలీని ఔట్ చేశాడు. ఇలా వేసిన మొదటి మూడు ఓవర్లలో మూడు వికెట్లు తీయటం ద్వారా ఇంగ్లండ్ ను ఇక ఏ దశలోనూ కోలుకోకుండా చేశాడు అక్షర్ పటేల్. మరో ఎండ్ లో కుల్దీప్, బుమ్రా కూడా రెచ్చిపోవటంతో బాగా ఫైట్ ఇస్తుందనుకున్న ఇంగ్లండ్ అతి కష్టం మీద వంద పరుగులు దాటి 103 పరుగులకు ఆలౌట్ అయ్యింది. నాలుగు ఓవర్లలో 23 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీయటం తోపాటు అంతకు ముందు బ్యాటింగ్ లో నూ ఓ సిక్సర్ బాదిన అక్షర్ పటేల్ నే మ్యాన్ ది మ్యాచ్ వరించింది.
క్రికెట్ వీడియోలు
India vs south Africa T20 World Cup Final | టీ20 వరల్డ్ కప్ ఫైనల్ లో ప్రత్యర్థులుగా పోటా పోటీ జట్లు
మరిన్ని చూడండి