అందరి మన్ననలు పొందిన ఐఏఎస్ అధికారి.. నేడు పదవీ విరమణ చేయనున్నారు. ఎన్నికల సమయంలో ఎంతో మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్ని మార్చినప్పటికీ, ఎన్నికల కమిషన్ నమ్మకాన్ని పొందిన ఏకైక అధికారి మాజీ సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి. కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో జవహర్‌రెడ్డి పదవి మారింది. ఆర్థికంగా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో శనివారం జవహర్‌రెడ్డి పదవీ విరమణ చేయనున్నారు.
కడప జిల్లాలో జన్మించిన జవహర్ రెడ్డి తిరుపతిలో పశువైద్య విద్యను పూర్తి చేశారు. అనంతరం అఖిల భారత సర్వీసుకు ఆయన ఎంపికయ్యారు. వివాద రహితుడిగా గుర్తింపు పొందారు. పొదుపుగా మాట్లాడ్డం, పనిపై అంకిత భావం జవహర్ రెడ్డి ప్రత్యేకం.
విభిన్న రాజకీయ దృక్పథాలున్న పాలకులతో కలిసి… వైఎస్ రాజశేఖరరెడ్డి, చంద్రబాబునాయుడు, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి, నారా లోకేశ్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి పరస్పర విభిన్న రాజకీయ ధోరణులు కలిగిన పాలకుల వద్ద కీలక బాధ్యతలు నిర్వహించడం జవహర్‌రెడ్డికే సాధ్యమైంది. సాధారణంగా అధికార మార్పిడి జరిగిన తర్వాత కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం అధికారులను కూడా మార్చుకుంటుంది. కానీ అందుకు జవహర్ రెడ్డి మినహాయింపు.
ఎవరు అధికారంలో ఉన్నా జవహర్‌రెడ్డిని కీలక స్థానంలో నియమించుకుంటూ వచ్చారు. దీనికి కారణం జవహర్ రెడ్డి నిబంధనలను అనుసరించి తన పని తాను చేసుకెళ్లడమే. అధికార పార్టీ ప్రాధాన్యతలను తెలుసుకుని, నిబంధనలకు లోబడి ఆయన పాలన చేస్తారు. అధికార పార్టీ పెద్దల నమ్మకాన్ని వమ్ము చేయకుండా విధులు నిర్వర్తించారు. ఒక ముఖ్యమంత్రి జవహర్ రెడ్డి గురించి ఆన్న మాటలు ” జవహర్ ఫైల్ చూస్తే చదవ కుండా సంతకం చేయవచ్చు” అని. జవహర్ పనితీరుకు, ఆయన్ని ఎందుకు చాయిస్‌గా ఎంచుకుంటారో ఇంతకు మించి ఉదాహరణ అవసరం లేదు.
కరోనా సమయంలో…
కరోనాను ఎదుర్కోవడంలో జవహర్ రెడ్డి పాత్ర అందరి ప్రశంసలు అందుకుంది. కరోనా సమయంలో జగన్ పాలనకు దేశ వ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. ఆ సమయంలో ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న జవహర్ రెడ్డి అత్యంత ప్రతిభావంతంగా పనిచేసారు. ముఖ్యంగా పేదలకు అండగా ఉండటంలో ప్రభుత్వం విజయవంతమైంది. అందులో ముఖ్య కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి పాత్ర కీలకం. అందుకే జవహర్ రెడ్డి టీటీడీ ఈఓగా పనిచేస్తున్నప్పుడు కూడా రెండో సారి కరోనా సమయంలో కమాండ్ కంట్రోల్ ఛైర్మన్‌గా జవహర్‌ను ప్రభుత్వం నియమించింది.
టీటీడీ ఈవోగా చెరగని ముద్ర
టీటీడీ ఈవోగా మంచి పాత్ర పోషించిన ముఖ్యులలో జవహర్ రెడ్డి ఒకరు. కరోనా సమయంలో ఆయన ఈఓగా పనిచేసారు. పని చేయడానికి పరిమితులున్నా ఆయన తీసుకున్న నిర్ణయాలతో టీటీడీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. విధి నిర్వహణలో చనిపోయిన ఉద్యోగుల వారసులకు ఉద్యోగ నియామకాలు. సుదీర్ఘ కాలం పాటు అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్యను ఏక కాలంలో పరిష్కరించిన అధికారి జవహర్‌రెడ్డి. చిన్న పిల్లలు, ప్రధానంగా పేద పిల్లల గుండె సంబంధిత సమస్యలతో ప్రాణాలు పోయే పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పద్మావతి హృదయాలయను స్థాపించారు. కొన్న వందల మంది చిన్నారులకు నేడు ప్రాణం పోస్తుంది పద్మావతి హృదయాలయ.
అంజనాద్రిలో ఆంజనేయుని జన్మస్థలం ఆలయ నిర్మాణం, శ్రీవారికి సమర్పించే అలంకరణలు వృథాగా పోకుండా తిరిగి భక్తులు పూజకు ఉపయోగించే వస్తువులుగా మార్చిన తీరు జవహర్ రెడ్డి పనితనానికి నిదర్శనం
ఎన్నికల సమయంలో వివాదం రాజకీయ కోణమే
జవహర్ రెడ్డి తన సర్వీసులో విమర్శలు ఎదుర్కొన్నది 2024 సార్వత్రిక ఎన్నికల్లో. ఎన్నికల్లో ప్రతి రాజకీయ పార్టీ నేతలు అధికారులు తనకు అనుకూలంగా ఉండాలని కోరుకుంటారు. అందుకు భిన్నంగా ఉంటే రాజకీయ ముద్ర వేస్తారు. ఎన్నికల సమయంలో జవహర్‌రెడ్డి పై విమర్శలు కూడా ఆ కోణంలోనే చూడాలి. ఎన్నికల కమిషన్ డీజీపీతో సహా ఆనేక మంది అధికారులపై చర్యలు తీసుకున్నప్పటికీ ఒక్క జవహర్ రెడ్డి విషయంలో ఎందుకు చర్యలు తీసుకోలేదు? అంటే ఆయన ఎన్నికల సంఘం నియమాలను తూచా తప్పకుండా పాటించారు కాబట్టి. ఎన్నికల సమయంలో కమిషన్ నిర్ణయాలను పాటిస్తారు తప్ప రాజకీయ పార్టీల కోరికలను తీర్చలేరు.
ఏ పార్టీ అధికారంలో ఉన్నా వారి ప్రాధాన్యతలను నిబంధనలకు లోబడి పాలన చేసి వారి మెప్పు పొందారు. ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించి వారి మెప్పు పొందారు. దటీజ్ జవహర్‌రెడ్డి. పదవీ విరమణ అనంతరం ఆయన శేష జీవితం సుఖసంతోషాలతో సాగాలి.