చంద్రబాబునాయుడు ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని తాజా నిర్ణయాలను గమనిస్తోంటే.. రాష్ట్రంలో వాలంటీరు వ్యవస్థను ఉంచినట్టా? ముంచినట్టా? అర్థం కావడం లేదు. వేతనాలు పది వేలకు పెంచుతానని ఆయన హామీ ఇచ్చిన వాలంటీరు వ్యవస్థ ప్రస్తుతం అసలు మనుగడలో లేదనిపిస్తోంది. మొత్తానికి వారంతా త్రిశంకుస్వర్గంలో ఉన్నారు.
చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన అత్యంత ఆకర్షణీయమైన హామీలలో వాలంటీర్లకు జీతం 10 వేల రూపాయలకు పెంచుతానన్నది కూడా ఒకటి. అప్పటి దాకా వారికి 5000 మాత్రమే జీతం లభించేది. వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూల వ్యక్తులు, ఆ పార్టీ యొక్క కార్యకర్తలు అనే అపోహలు తెలుగుదేశం పార్టీకి ఉండేవి. వాలంటీర్ వ్యవస్థ గురించి అనేక రకాల అడ్డగోలు దుష్ప్రచారాలు చేసిన సంగతి కూడా ప్రజలందరికీ తెలుసు. వాలంటీర్లను ఆకర్షించడమే లక్ష్యం అన్నట్టుగా చంద్రబాబు నాయుడు ఒక కొత్త ఎత్తుగడ వేశారు.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వారికి అందిస్తున్న 5000 వేతనానికి బదులుగా 10000 చేస్తున్నట్లు ప్రకటించారు. వాలంటీర్లు అందరూ ఎగబడి తెలుగుదేశానికి అనుకూలంగా పనిచేసేలా వారిని పురిగొల్పారు. ఫలితం సాధించారు. తీరా ఎన్నికల పర్వం ముగిసిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ ఉందో లేదో తెలియని అయోమయ పరిస్థితిలో నెలకొంది.
ఒకవైపు ఎన్నికల సమయంలో రాజీనామాలు చేసిన వాలంటీర్లు అందరూ కూడా చంద్రబాబు ప్రభుత్వం తమకు 10,000 వంతున పెద్ద జీతాలు ఇచ్చేస్తుంది అనే భ్రమలో- తమతో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు బలవంతంగా రాజీనామాలు చేయించారని, బెదిరించారని, వారి మీద పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. సుమారు 2.6 లక్షల పైచిలుకు వాలంటీర్లు రాష్ట్రంలో పనిచేస్తుండగా 60 వేల మందికి పైగా రాజీనామాలు చేశారు. అలాగని ఈ మిగిలిన రెండు లక్షల మంది భవితవ్యం ఏమిటో, వర్తమానం ఏమిటో కూడా ఎవరికీ అర్తం కావడం లేదు.
ఎందుకంటే జూలై ఒకటో తేదీ నాటికి ఇళ్ల వద్దనే పెన్షన్లు పంపిణీ చేయాలని చంద్రబాబు సర్కారు నిర్ణయించింది. ఆయన మాట ఇచ్చినట్లుగా మూడు నెలల అరియర్స్ కలిపి పెంచిన పెన్షన్ 4000 తో సహా ఒక్కొక్కరికి 7000 వంతున జులై ఒకటో తేదీన ఇళ్ల వద్దకే అందజేయడానికి కసరత్తు జరుగుతోంది.
తమాషా ఏమిటంటే పెన్షన్ల పంపిణీ ప్రక్రియలో వాలంటీర్లు భాగస్వాములు కాబోవడం లేదు. గ్రామ రెవెన్యూ సచివాలయ ఉద్యోగుల ద్వారా మాత్రమే జులైలో పెన్షన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా వార్తలు వస్తున్నాయి. అలాగే స్కిల్ సెన్సెస్ (నైపుణ్య గణన) కోసం రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికి సర్వే నిర్వహించి యువతరానికి ఉన్న అర్హతలు నైపుణ్యాలను క్రోడీకరించే పనిని కూడా సచివాలయ ఉద్యోగుల ద్వారా మాత్రమే చేపట్టడానికి ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
సాధారణంగా ఇలాంటి పనులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కాలంలో వాలంటీర్ల వ్యవస్థ ద్వారా జరిగేవి. వాలంటీర్లు క్షేత్రస్థాయిలో ప్రతి 50 ఇళ్లకు ఒకరు వంతున ఉండేవారు కాబట్టి చాలా ఖచ్చితమైన వివరాలు సేకరించడం, అనుకున్న సమయానికి లక్ష్యాలను పూర్తి చేయడం జరుగుతూ ఉండేది. అయితే ఇప్పుడు వాలంటీర్ల ప్రస్తావనే లేకుండా పెన్షన్ల పంపిణీ గానీ, నైపుణ్య గణనకు సంబంధించిన సన్నాహాలు గాని జరుగుతున్నాయి. మరి వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా పోతుందా అనేది డోలాయమానంగానే ఉంది.
చంద్రబాబు గెలిస్తే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తారని వైసీపీ నాయకులు ముందు నుంచి హెచ్చరించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చారు గాని, ఇప్పటిదాకా తాను ప్రకటించిన పదివేల వేతనాన్ని వారికి ఇవ్వలేదు. వారికి పని కూడా ఇవ్వకుండా చేస్తున్నారు. దీంతో వాలంటీర్లందరిలోనూ తాము ఉంటామో పోతామో అనే భయం నెలకొంది.