‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’, ‘బజరంగీ భాయిజాన్’ వంటి పలు సంచలన విజయాల వెనుక దర్శకుడు రాజమౌళి (Rajamouli) తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ (Vijayendra Prasad) ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆయన రచయితగానే చాలామందికి తెలుసు. దర్శకుడిగా కొన్ని సినిమాలు చేశారని చాలా తక్కువమందికి తెలుసు. విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో ‘శ్రీ కృష్ణ 2006’, ‘రాజన్న’, ‘శ్రీవల్లీ’ వంటి సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఆయన మరోసారి మెగాఫోన్ పట్టబోతున్నారని తెలుస్తోంది. అంతేకాదు, ఆ సినిమా బడ్జెట్ ఏకంగా రూ.450 కోట్లు అని ప్రచారం జరుగుతోంది.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) పై సినిమా చేయడానికి విజయేంద్ర ప్రసాద్ సన్నాహాలు చేస్తున్నారట. 2025 సెప్టెంబర్ నాటికి ఆర్ఎస్ఎస్ (RSS) స్థాపించి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా.. ఆ సంస్థ గొప్పతనం గురించి ఈ తరానికి తెలిసేలా ఒక భారీ చిత్రాన్ని చేయాలని భావిస్తున్నారట. విజయేంద్ర ప్రసాద్ కి.. బీజేపీ అన్నా, ఆర్ఎస్ఎస్ అన్నా ఎంతో అభిమానం. బీజేపీ ప్రభుత్వం 2022 జులైలో ఆయనను రాజ్యసభకు కూడా నామినేట్ చేసింది. ఈ క్రమంలో ఇప్పుడు విజయేంద్ర ప్రసాద్ ఆర్ఎస్ఎస్ పై సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారన్న వార్త సంచలనంగా మారింది. పైగా ఈ సినిమా బడ్జెట్ రూ.400-500 కోట్లు అనే వార్త మరింత సంచలనం అవుతోంది. ఈ చిత్రం కోసం తెలుగు, హిందీ సహా వివిధ భాషలకు చెందిన పలువురు ప్రముఖ నటీనటులను రంగంలోకి దింపనున్నారని సమాచారం.
భారీ సినిమాలతో ఇండియాలోనే టాప్ డైరెక్టర్ గా రాజమౌళి పేరు తెచ్చుకున్నారు. అలాంటిది ఇప్పుడు ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ రూ.450 కోట్ల బడ్జెట్ తో, అందునా ఆర్ఎస్ఎస్ పై సినిమా చేయనున్నారనే న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ చిత్రంతో విజయేంద్ర ప్రసాద్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.