ప్రత్యేక హోదాపై కేంద్ర మంత్రి ఏమన్నారంటే?
ప్రత్యేక హోదాపై మరోసారి చర్చ మొదలవ్వడంతో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ స్పందించారు. కేంద్ర, రాష్ట్రాల్లో కూటమి ప్రభుత్వమే ఉందన్నారు. ప్రత్యేక హోదా తీర్మానాలు చేస్తే ఇచ్చే అంశం కాదన్నారు. తీర్మానాలతో ప్రత్యేక హోదా వస్తే దేశంలోని అన్ని రాష్ట్రాలు ఇలా చేస్తాయన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా తన పరిధిలోని అంశం కాదని, దీనిపై ప్రధాని మోదీ నిర్ణయం తీసుకోవాలన్నారు. బిహార్‌కు కూడా ఇదే వర్తిస్తుందన్నారు. ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వడంలేదో గతంలో ఆర్థిక సంఘం స్పష్టం చేసిందన్నారు. ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ప్రత్యేక హోదా స్థానంలో ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చారన్నారు. ఆ నిధులతో ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ వైఫల్యంతో పోలవరం ప్రాజెక్టు సమస్యల్లో కూరుకుపోయిందన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. ఇవాళ సాయంత్రం దిల్లీలో ఏపీకి చెందిన ఎన్డీఏ ఎంపీలతో సీఎం చంద్రబాబు సమావేశమవుతారని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ చెప్పారు. రాష్ట్రానికి సంబంధించిన అన్ని అంశాలపై సీఎం చంద్రబాబుతో చర్చిస్తామన్నారు.