పొలిటికల్ లీడర్స్, సినిమా సెలబ్రిటీల భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే విషయాల్లో అలవోకగా చెప్పేసి ఆ తర్వాత అందరి విమర్శలను ఎదుర్కోవడం వేణుస్వామికి అలవాటైన విషయం. ఆమధ్య ఎంతో ఉత్కంఠగా జరిగిన ఏపీ ఎన్నికల్లో సైతం తన భవిష్యవాణిని వినిపించి, ఆ తర్వాత వచ్చిన ఫలితాల వల్ల ఇరకాటంలో పడ్డారు. ఆ విషయంలో తన అంచనా తప్పడంతో కొన్నాళ్ళపాటు మౌనంగా ఉన్నారు. చాలా రోజుల తర్వాత మళ్ళీ తెరపైకి వచ్చి ఎప్పటిలాగే తన కామెంట్స్‌తో అందర్నీ ఎంటర్‌టైన్ చేస్తున్నారు.
గతంలో ప్రభాస్ గురించి తీవ్రమైన కామెంట్స్ చేసి ఫ్యాన్స్ నుంచి ట్రోలింగ్‌ని ఎదుర్కొన్న వేణు స్వామి మరోసారి ప్రభాస్‌నే టార్గెట్ చేశారు. ప్రభాస్ తాజా సినిమా ‘కల్కి’పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కారు. ‘బాహుబలి తర్వాత ప్రభాస్‌కి హిట్ రాదు. అతనితో సినిమాలు తీస్తే నిర్మాతలు నష్టపోతారని చెప్పాను. ఆ సినిమా తర్వాత వచ్చిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు రిలీజ్ అయి నేను చెప్పినట్టుగానే డిజాస్టర్ అయ్యాయి. అతని విషయంలో నేను చెప్పింది నిజమే అయ్యింది కదా. అప్పుడు ఎవరైనా నా మెడలో దండ వేశారా? నాకు కిరీటాలు పెట్టారా? అలాగే ఆ తర్వాత వచ్చిన సలార్ హిట్ అయ్యిందంటూ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. ఆ సినిమాకి 135 కోట్లు లాస్ వచ్చింది. అందరూ హిట్ అనుకుంటున్నారుగానీ ఈ విషయం ఎక్కడైనా వినిపించిందా.
ఇప్పుడు ‘కల్కి’ సూపర్‌హిట్ అంటున్నారు. అందులో హీరో ప్రభాసేనా.. అతను స్క్రీన్‌మీద ఎంతసేపు కనిపిస్తాడు. ఓవరాల్‌గా ఆ నిర్మాతకు ఎంత డబ్బు వస్తుంది. అవన్నీ త్వరలోనే తెలుస్తాయి. ఏది ఏమైనా గతంలో మాదిరిగా మిర్చి, మిస్టర్ పర్‌ఫెక్ట్ వంటి సినిమాలు చేసే పరిస్థితి ప్రభాస్‌కి లేదు. ప్రభాస్‌తో నాకు ఎలాంటి శత్రుత్వం లేదు. అతను నాకెంతో క్లోజ్. ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత నన్ను అందరూ ట్రోల్ చేసినప్పుడు ప్రభాస్ నాకు మోరల్ సపోర్ట్ ఇచ్చారు. మా ఫామ్ హోస్‌లో పండిన సీతాఫలాల్ని ప్రభాస్‌కి పంపించాను. నన్ను ట్రోల్ చేసే ఫ్యాన్స్‌కి ఇవన్నీ తెలియవు కదా. తన గురించి ఏం చెప్పినా ప్రభాస్ పట్టించుకోడు’ అంటూ చెప్పుకొచ్చారు వేణుస్వామి.