దిశ, ఫీచర్స్ : కొందరు ఆఫీసులో సాధారణంగా కంటే ఎక్కువగా పని ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటారు. అలసటను అనుభవిస్తుంటారు. విరామం తీసుకోవాలనుకుంటారు కానీ ఎక్కడ పనికి ఆటంకం కలుగుతుందోనని విరమించుకుంటారు.సెలవుల విషయంలోనూ అదే చేస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే పనిపట్ల ఓవర్ కమిట్మెంట్‌తో ఉంటారు. ఆఫీసు కాల్స్, మెయిల్స్ చెక్ చేస్తుంటారు. ఆన్ వర్కులో లేనందుకు గిల్టీగా ఫీలవుతుంటారు. ఈ క్రమంలో ఎదురయ్యే మానసిక ఒత్తిడి కారణంగా ఆకస్మిక అనారోగ్యానికి గురవుతారు. దీనినే ‘లీజర్ సిక్‌నెస్’ అంటున్నారు నిపుణులు.
హిస్టిల్ కల్చర్ అంటే?
అధిక పని ఒత్తిడి కలిగిన పరిస్థితిలో దాని నుంచి తప్పించుకోవడానికి రిలాక్స్ అవ్వాలనుకుంటారు. కానీ ప్రొడక్టివిటీ తగ్గుతుందేమోనని లేదా టార్గెట్ పూర్తికాదేమోనని ఆందోళన చెంది ఆ పనిచేయరు. అంటే ఇక్కడ వర్క్ అనేది ఒక అడిక్షన్‌గా మారిపోతుంది. దీనిని కార్పొరేట్ సెక్టార్‌లో ‘హిస్టిల్ కల్చర్’ అని కూడా అంటారు. ఇక్కడ ఉద్యోగులు ఎక్కువ పని ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటారు. అయితే ఆఫ్ తీసుకున్నప్పుడు లేదా లీవులో ఉన్నప్పుడు పనిమీద బెంగతో తలనొప్పి, జలుబు, జ్వరం వంటి అనారోగ్యానికి గురవుతారు. అంటే ‘లీజర్ సిక్‌నెస్’కు గురవుతారు.
లీజర్ సిక్‌నెస్ లక్షణాలు
ఇది నిద్రలేని రాత్రులు, అంతులేని పనిగంటలు, ఎల్లప్పుడూ ఆన్ డ్యూటీలో లేదా ఆన్ వర్కింగ్‌లో ఉండే మనస్తత్వాన్ని ప్రేరేపిస్తుంది. వర్క్ నుంచి డౌన్‌టైమ్ లేదా రిలాక్సేషన్ అనేది సంబంధిత వ్యక్తిలో తరచుగా అపరాధ భావానికి దారితీస్తుంది. తాను సోమరినైపోతానేమోనని ఆందోళన చెందుతుంటాడు. దీంతో తన ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా శ్రేయస్సును పణంగా పెట్టైనా సరే పని మాత్రమే పూర్తి చేయాలనుకుంటాడు. అయితే లీవులో ఉన్నప్పుడు తీవ్రమైన అలసట, కండరాల నొప్పి వంటి లక్షణాలతో బాధపడుతుంటారు. ‘హిస్టిల్ కల్చర్’లో అయితే ఈ పరిస్థితి ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.
ఎలా తెలిసింది?
ప్రముఖ డచ్ సైకాలజిస్టు ప్రొఫెసర్ యాడ్ వింగర్ హోట్స్ మొదటగా ‘లీజర్ సిక్‌నెస్’ అనే పదాన్ని ఉయోగించాడు. వర్క్ అండ్ స్ట్రెస్ రిలేటెడ్ స్టడీలో భాగంగా అతను 2000 మందిని సర్వే చేయగా వీరిలో 3 శాతం మంది పని నుంచి విరామం తీసుకున్నప్పుడు తలనొప్పి, వికారం, అలసట, జలుబు, ఫ్లూ వంటి లక్షణాల్లో కూరుకుపోయినట్లు నివేదించారు. ఈ పరిస్థితిని ఎనలైజ్ చేసిన వింగర్ దానికి ‘లీజర్ సిక్‌నెస్’గా పేరు పెట్టాడు.
కారణలేమిటి?
లీజర్ సిక్‌నెస్ ఎందుకు సంభవిస్తుందో నిరూపించేందుకు కచ్చితమైన సైంటిఫిక్ ఆధారాలు లేనప్పటికీ, మానసిక నిపుణుల అంచనాలు, విశ్లేషణలు మాత్రం ఉన్నాయి. ఉద్యోగాల్లో అధిక పని ఒత్తిడిని ఎదుర్కొంటున్నవారు, వర్క్ అండ్ లైఫ్ బ్యాలెన్స్ మెయింటెన్ చేయడంలో ఇబ్బంది పడేవారు దీనికి గురవుతుంటారు. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో పబ్లిషైన ఓ స్టడీ కూడా ఇదే విషయాన్ని పేర్కొన్నది. ఉద్యోగాలపట్ల ఓవర్ కమిట్మెంట్, స్ట్రాంగ్ రెస్పాన్సిబిలిటీ కలిగిన వ్యక్తులు ఎక్కువగా దీనిబారిన పడుతున్నారు.
పరిష్కారం ఏమిటి?
లీజర్ సిక్‌నెస్ అనేది ఒత్తిడితో కూడిన పని నుంచి విరామం తీసుకోవడాన్ని అపరాధంగా భావించడంవల్ల వస్తుంది. కాబట్టి ఆ ఫీలింగ్ వదిలించుకునేలా మీ మైండ్ సెట్ మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా సెలవులో, ఆఫ్‌లో లేదా లీజర్‌లో ఉన్నప్పుడు మీ ఆఫీసు వర్కు గురించి ఆలోచించవద్దు. మీ మనస్సును వర్క్ రిలేటెడ్ థాట్స్ అండ్ ఇష్యూస్ డామినేట్ చేస్తుంటే.. వాటిని ఒక బాక్సులో బంధించి బయట విసిరేసినట్లు ఊహించుకోండి. అలాగే మరో అంశంపై దృష్టి మరల్చడం ద్వారా మీ మనసు సెలవులో లేదా లీజర్‌లో ఉన్నప్పుడు వర్కు గురించి ఆలోచించకుండా ఉండవచ్చు. ఈ విధమైన ప్రాక్టీస్‌తో క్రమంగా మారిపోతారు. అలాగే హెల్తీ హాబిట్స్ కలిగి ఉండటం, వెకేషన్‌లో లేదా లీవులో ఉన్నప్పుడు గుడ్ అండ్ క్వాలిటీ స్లీప్ సైకిల్‌ను, హెల్తీ హైజీన్‌ను పాటించడంవల్ల మంచి ఫలితంగ ఉటుంది.