నటసింహ నందమూరి బాలకృష్ణతో ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ వంటి భారీ బ్లాక్‌బస్టర్స్‌తో హ్యాట్రిక్ సాధించారు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను. అయితే ‘అఖండ’ తర్వాత అదే ఊపులో రామ్‌తో చేసిన ‘స్కంద’ బోయపాటి దూకుడుకి బ్రేక్ వేసింది. అతని కెరీర్‌లోనే భారీ డిజాస్టర్‌గా ఈ సినిమా నిలిచింది. ఈ నేపథ్యంలోనే ‘అఖండ2’ తెరపైకి వచ్చింది. త్వరలోనే స్టార్ట్ చేస్తాం అని సినిమాపై క్లారిటీ ఇచ్చారు బోయపాటి. ప్రస్తుతం బాలయ్య తన 109 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈలోగా తను అనుకున్న సీక్వెల్‌కి సంబంధించిన కథపై కూర్చున్నారు బోయపాటి. బాలయ్యతో తన విజయపరంపర కొనసాగించాలన్న ఉద్దేశంతో ఇప్పటివరకు అనుకున్న కథలో కొన్ని మార్పులు చేస్తున్నారని తెలుస్తోంది.
తాజాగా అందుతున్న సమాచారం మేరకు బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాలో కొన్ని సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని సమాచారం. అన్నీ కుదిరితే అక్టోబర్ తర్వాత సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్ళాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు దక్షిణ భారత దేశం గొప్పతనాన్ని చాటి చెప్పే విధంగా ఓ కొత్త కోణంలో ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. హిందూ దేవాలయాల ప్రాధాన్యం గురించి ఈ సినిమాలో ఎక్కువగా చర్చించే అవకాశం ఉంది. స్వతహాగా పరమభక్తుడైన బాలయ్య ఇలాంటి సినిమాల్లో తన నటవిశ్వరూపాన్ని చూపిస్తారనడంలో సందేహం లేదు. ఈ సినిమాకి సంబంధించిన మరో అప్‌డేట్ ఏమిటంటే.. బాలీవుడ్ స్టార్ సంజయ్‌దత్ ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చెయ్యబోతున్నారట. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.