అల్లు అర్జున్ (Allu Arjun), డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతోన్న ‘పుష్ప-2’ (Pushpa 2) చిత్రం డిసెంబర్ 6న విడుదల కానున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో విడుదలవుతున్న ఈ పాన్ ఇండియా మూవీకి.. పోటీ వెళ్ళే సాహసం దాదాపు ఎవరూ చేయరు. అయితే మంచు విష్ణు మాత్రం తగ్గేదేలే అంటున్నాడు.
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా రూపొందుతోన్న చిత్రం ‘కన్నప్ప’ (Kannappa). మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో.. ప్రభాస్ (Prabhas) తో పాటు అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వంటి పలువురు స్టార్స్ కీలక పాత్రలలో మెరవనున్నారు. దాంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రాన్ని డిసెంబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఇటీవల వార్తలొచ్చాయి. ఆ వార్తలను నిజం చేస్తూ.. ‘కన్నప్ప’ను డిసెంబర్ లో రిలీజ్ చేస్తున్నట్లు తాజాగా విష్ణు అధికారికంగా ప్రకటించాడు.
డిసెంబర్ లో ‘కన్నప్ప’ విడుదలైతే.. ‘పుష్ప-2’ వసూళ్లపై ఎంతోకొంత ప్రభావం పడే అవకాశముంది. ఎందుకంటే ‘కన్నప్ప’లో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వంటి స్టార్స్ ఉన్నారు. దాంతో ఈ సినిమాకి పాన్ ఇండియా వైడ్ గా మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశముంది. ముఖ్యంగా తెలుగునాట ప్రభాస్ స్టార్డంతో భారీ ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే.. బాక్సాఫీస్ దగ్గర ఊహించని మ్యాజిక్ చేసినా ఆశ్చర్యంలేదు. అలా అని ‘పుష్ప-2’ని ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికి లేదు.
అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన ‘పుష్ప-1’.. 2021 డిసెంబర్ లో విడుదలై పాన్ ఇండియా వైడ్ గా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. అందుకే దానికి కొనసాగింపుగా వస్తున్న ‘పుష్ప-2’ పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. పాజిటివ్ టాక్ వస్తే.. వరల్డ్ వైడ్ గా రూ.1000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేస్తుందనే అంచనాలున్నాయి. మరి డిసెంబర్ లో విడుదలవుతున్న ‘కన్నప్ప’.. ‘పుష్ప-2’ ప్రభంజనానికి ఏ మేరకు అడ్డుకట్ట వేస్తుందో చూడాలి.