సినిమా పేరు: పేక మేడలు
తారాగణం: వినోద్ కిషన్, అనూష కృష్ణ, రితిక శ్రీనివాస్, జగన్ యోగి రాజ్, అనూష నూతల, గణేష్ తిప్పరాజు, నరేన్ యాదవ్ తదితరులు
సంగీతం: స్మరన్ సాయి
డీఓపీ: హరిచరణ్
ఎడిటర్: సృజన అడుసుమిల్లి, హంజా అలీ
రచన, దర్శకత్వం: నీలగిరి మామిళ్ల
నిర్మాత: రాకేష్ వర్రే
బ్యానర్: క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ: జూలై 19, 2024
‘నా పేరు శివ’, ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు వినోద్ కిషన్ హీరోగా నటించిన చిత్రం ‘పేక మేడలు’. క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నటుడు రాకేష్ వర్రే నిర్మించిన ఈ చిత్రానికి నీలగిరి మామిళ్ల దర్శకుడు. విభిన్న తరహా ప్రమోషన్స్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ మూవీ.. నేడు థియేటర్లలో అడుగుపెట్టింది. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
హైదరాబాద్ లోని ఒక చిన్న బస్తీలో ఉండే లక్ష్మణ్(వినోద్ కిషన్).. పేరుకి ఇంజనీరింగ్ చదివినా ఉద్యోగం చేయడంపై ఆసక్తి చూపించడు. కష్టపడి డబ్బు సంపాదించాలనే ఆలోచనే అతనికి ఉండదు. ఏదోకటి చేసి రాత్రికి రాత్రి కోటీశ్వరుడు అయిపోవాలి అనుకునే టైపు. అందుకే రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా పనిచేస్తూ, రిచ్ లైఫ్ గడపాలని కలలు కంటుంటాడు. కానీ అందులో డబ్బులు రాకపోవడంతో.. తన భార్య వరాలు(అనూష కృష్ణ) సంపాదన మీద బతుకుతుంటాడు. వరాలు చిన్న చిన్న పనులు చేస్తూ.. కుటుంబాన్ని పోషిస్తుంటుంది. ఏదైనా జాబ్ చేయమని, బాధ్యతగా ఉండమని వరాలు ఎంత చెప్పినా.. లక్ష్మణ్ తీరులో మార్పు రాదు. మరోవైపు, లక్ష్మణ్ కి శ్వేత(రితిక శ్రీనివాస్) అనే బాగా డబ్బున్న మహిళ పరిచయమవుతుంది. తాను రిచ్ పర్సన్ ని, రియల్ ఎస్టేట్ చేస్తాను అంటూ మాయమాటలు చెప్పి శ్వేతకి బాగా దగ్గరైన లక్ష్మణ్.. కుటుంబాన్ని గాలికొదిలేస్తాడు. శ్వేత రాకతో లక్ష్మణ్ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? ఈ విషయం తెలిసి వరాలు ఏం చేసింది? నేలని విడిచి అత్యాశతో గాలిలో మేడలు కట్టాలని కలలు కన్న లక్ష్మణ్ కలలు నిజమయ్యాయా? చివరికి ఏం జరిగింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ:
“సక్సెస్ కి షార్ట్ కట్ లు ఉండవు, కష్టే ఫలి” అని పెద్దలు చెబుతుంటారు. అయినప్పటికీ కొందరు.. కష్టపడకుండానే ఏదోక మాయ చేసి, రాత్రికి రాత్రి కోటీశ్వరులు కావాలని కలలు కంటుంటారు. అలాంటి నిజ జీవిత పాత్రల నుంచి స్ఫూర్తి పొంది ఈ కథ రాసుకున్నట్లుగా ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. బాధ్యత తెల్సిన భార్య, బాధ్యత మరిచి అత్యాశతో గాల్లో మేడలు కట్టే భర్త మధ్య జరిగే కథగా ఈ చిత్రం రూపొందింది. గతం ఇలాంటి కథలో కొన్ని సినిమాలు వచ్చాయి. అయితే దర్శకుడు కథనంలో, సన్నివేశాల రూపకల్పనలో కొత్తదనం చూపించే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా పతాక సన్నివేశాలు మెప్పించాయి.
ఫస్టాఫ్ లో లక్ష్మణ్-వరాలు జీవితం, లక్ష్మణ్-శ్వేత పరిచయం వంటి సన్నివేశాలను చూపించారు. ఇంటర్వెల్ బ్లాక్ లో పెద్దగా మెరుపులు లేవు. సెకండాఫ్ లో లక్ష్మణ్-వరాలు మధ్య దూరం, వారి జీవితాలలో మలుపులతో ఆసక్తికరంగా సాగింది. క్లైమాక్స్ ఆకట్టుకుంది. ఈ సినిమాలో బస్తీ జీవితాలను కళ్ళకు కట్టినట్టు చూపించారు. సన్నివేశాలు రియాలిటీకి దగ్గరగా ఉండేలా చూసుకున్నారు. మహిళా సాధికారికతను చూపించే ప్రయత్నం చేయడంతో పాటు.. అత్యాశను, బద్దకాన్ని వీడి కష్టపడితేనే జీవితం బాగుంటుందనే పాయింట్ ని చూపించారు. అయితే ఈ సినిమాలో కొన్ని ల్యాగ్ సీన్స్ ఉన్నాయి. ఆ విషయంలో శ్రద్ధ తీసుకుంటే, అవుట్ పుట్ ఇంకా మెరుగ్గా ఉండేది.
దర్శకుడు తాను అనుకున్న పాయింట్ ని తెరపైకి తీసుకు రావడంలో బాగానే సక్సెస్ అయ్యాడు. కామెడీ, ఎమోషన్స్ ని సమపాళ్లలో పండించాడు. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ ఆకట్టుకున్నాయి. ఎడిటింగ్ ఇంకా షార్ప్ గా ఉండాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:
అత్యాశతో గాల్లో మేడలు కట్టే, బాధ్యత లేని భర్త పాత్రలో వినోద్ కిషన్ చక్కగా ఒదిగిపోయాడు. కుటుంబ బాధ్యతను భుజానికెత్తుకోవడమే కాకుండా, భర్తలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించే భార్య పాత్రలో అనూష కృష్ణ మెప్పించింది. రితిక శ్రీనివాస్, జగన్ యోగి రాజ్, అనూష నూతల, గణేష్ తిప్పరాజు, నరేన్ యాదవ్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.
ఫైనల్ గా..
కామెడీ, ఎమోషన్స్ కలబోతతో.. అంతర్లీనంగా మంచి సందేశంతో రూపొందిన ‘పేక మేడలు’ చిత్రం మెప్పించింది. పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా హ్యాపీగా ఈ సినిమాని చూసేయొచ్చు.
రేటింగ్: 2.75/5