డిసెంబర్ రిలీజ్ అనగానే ముందుగా గుర్తొచ్చే సినిమాలు రెండంటే రెండు మాత్రమే. వీటిలో ఒకటి నితిన్ సినిమా కాగా, రెండోది నాగచైతన్య నటిస్తున్న తండేల్. ఈ రెండు సినిమాలు చాన్నాళ్లుగా డిసెంబర్ రిలీజ్ అంటూ ప్రకటనలు ఇస్తూ వస్తున్నాయి. అయితే ఇప్పుడీ నెల నుంచి నాగచైతన్య నటిస్తున్న తండేల్ సినిమా తప్పుకునేలా ఉంది.
ఆల్రెడీ పుష్ప-2 వాయిదా పడి డిసెంబర్ 6కు వచ్చింది. తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప కూడా డిసెంబర్ లోనే వస్తుందంటూ తాజాగా మంచు విష్ణు ప్రకటించాడు. ఈ రెండు సినిమాలకు తోడు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, బాలయ్య సినిమాలు కూడా డిసెంబర్ లిస్ట్ లో ఉన్నాయనే ప్రచారం నడుస్తోంది.
మరోవైపు నితిన్ రాబిన్ హుడ్ రేసులో ఉండనే ఉంది. దీంతో తప్పనిసరి పరిస్థితిలో తండేల్ సినిమాను డిసెంబర్ నుంచి తప్పించారనే టాక్ వినిపిస్తోంది. అదే కనుక జరిగితే ఈ ఏడాది నాగచైతన్య నుంచి ఒక్క సినిమా కూడా లేనట్టే.
చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తండేల్ సినిమాలో చైతూ సరసన సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. డిసెంబర్ కు రావడం అస్సలు సమస్యే కాదు. కానీ మిగతా సినిమాలతోనే సమస్య వచ్చిపడింది.