జనసేనాని, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఎక్కడున్నారు? ఏమయ్యారు? అనే ప్రశ్న ఉత్పన్నమైంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అప్పుడప్పుడైనా ఆయన కనిపించేవారు. బలంగా మాట్లాడేవారు. జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడేవారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎందుకనో ఆయన తప్పించుకుని తిరుగుతున్నారనే భావన ప్రజల్లో కలుగుతోంది. అధికారంలోకి వచ్చిన కొత్తలో నీతిసూత్రాలు వల్లించారు.
మనకు అపరిమితమైన అధికారం ఇచ్చింది… వైసీపీపై ప్రతీకారం తీర్చుకోడానికి కాదని పవన్ అన్నారు. చాలా హామీలు ఇచ్చామని, వాటిని నెరవేర్చే బాధ్యత మనపై ఉందని చెప్పారు. ఆ బాధ్యత తాను తీసుకుంటానని కూడా పవన్ ప్రకటించారు. అలాగే శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై వుందన్నారు. ముఖ్యంగా మహిళలపై అఘాయిత్యాలు, వేధింపులు లేకుండా చూడడం ప్రభుత్వాల బాధ్యతగా ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గొప్పగా చెప్పారు.
ఎన్నో ఆదర్శాలు, నీతిసూత్రాలు చెప్పిన పవన్‌కల్యాణ్ జనానికి నచ్చారు. ఆయన మాటల్ని విశ్వసించి కూటమికి పట్టం కట్టారని జనసేన నేతలు చెబుతుంటారు. పవన్ కోరుకున్నట్టే కూటమి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన కొత్తలో పవన్ చక్కగా మాట్లాడ్డం విన్నాక… ప్రజావ్యతిరేక విధానాల్ని ఉప ముఖ్యమంత్రి అడ్డుకుంటారనే విశ్వాసం కలిగింది. కానీ కాలం గడిచేకొద్ది పవన్ మౌనముద్రలోకి వెళ్లిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
నాలుగు రోజులకొకసారి మాత్రమే ఆయన గురించి మీడియాలో వార్తలొస్తున్నాయి. అసలు ఆయన కనిపించడమే మానేశారనే అభిప్రాయం బలపడుతోంది. దీంతో ఏ అన్యాయం జరిగినా, కనీసం పవన్‌కల్యాణ్ అయినా స్పందించాలి కదా అనే ప్రశ్న తెరపైకి వస్తోంది. ఏపీలో వైసీపీ కార్యకర్తలు, నాయకులపై దారుణంగా దాడులు, హత్యలు చోటు చేసుకుంటున్నాయి. బాలికలు, మహిళలపై హత్యాచారాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.
ఇటీవల నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో అదృశ్యమైన బాలిక ఆచూకీ ఇంత వరకూ లేదు. పవన్‌కల్యాణ్ రావాలని, న్యాయం చేయాలని బాధిత చిన్నారి తల్లిదండ్రులు మీడియా ముందుకొచ్చి వేడుకున్నా పవన్‌కల్యాణ్ మాత్రం స్పందించలేదు. ఈ ఘటనపై పవన్‌కల్యాణ్ పొంతన లేకుండా మాట్లాడి ఆశ్చర్యపరిచారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్‌కల్యాణ్ ఇలాగే వ్యవహరిస్తే మాత్రం చంద్రబాబు సర్కార్ తప్పుల్లో భాగస్వామిగా వ్యతిరేకత మూట కట్టుకోవాల్సి వస్తుంది. ఆ విషయాన్ని గ్రహించి తాను ఏవైతే చెప్పారో, వాటికి కట్టుబడి వుండాల్సిన బాధ్యత వుంది.
The post పవన్‌కల్యాణ్ ఎక్కడ? appeared first on Great Andhra.