‘మానవ సేవే మాధవ సేవ’, ‘ప్రార్థించే పెదాల కన్నా.. సాయం చేసే చేతులు మిన్న’.. ఇలాంటి కొటేషన్స్ కొందరికి కరెక్ట్‌గా సరిపోతాయి. మనకు ఎంత ఆదాయం వస్తుంది, అందులో ఇతరులకు ఎంత సాయం చేస్తున్నాము అనే లెక్కలు వేసుకోకుండా, అడిగిన వారికి కాదనకుండా తమకు అందుబాటులో ఉన్న సాయం చేసేవాళ్ళు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. వారిలో ప్రముఖంగా చెప్పుకోదగిన వారు సోనూ సూద్. తెలుగు సినిమాల్లో ఎక్కువగా విలన్ క్యారెక్టర్సే చేసిన సోను నిజ జీవితంలో మాత్రం హీరో అనిపించుకున్నాడు.
కరోనాతో దేశం అల్లకల్లోలమైపోతున్న సమయంలో వివిధ ప్రాంతాల్లోని చాలామంది సోను సహాయాన్ని అందుకున్నారు. ఆ సమయంలో ఒకటి కాదు, రెండు కాదు ఎన్నో రకాలుగా ప్రజలకు సాయమందించాడు. దీంతో సినిమాల్లో విలన్ అయినప్పటికీ, నిజజీవితంలో హీరో అనిపించుకున్నాడు. ఆ తర్వాత కూడా ఏదో ఒక సాయం చేస్తూ వార్తల్లోకి వస్తూనే ఉన్నాడు. తాజాగా అలాంటి ఓ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని బనవనూరుకు చెందిన దేవికుమారికి చదువుకోవాలని ఉన్నప్పటికీ ఆర్థిక పరమైన కారణాల వల్ల ముందుకు వెళ్ళలేకపోతోంది. ఈ విషయం తెలుసుకున్న సోనూ సూద్ ఆమెకు సాయం చేస్తానని మాట ఇచ్చాడు. చెప్పినట్టుగానే దేవికుమారి ఎడ్యుకేషన్ కోసం సోను ఇటీవల తన సాయం అందించాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేశారు.
దీనిపై దేవికుమారి స్పందిస్తూ ‘నాకు చదువు మీద ఎంతో ఆసక్తి ఉంది. కానీ, మా కుటుంబ ఆర్థిక పరిస్థితులు అందుకు అనుకూలంగా లేకపోవడంతో చదువును మధ్యలోనే ఆపెయ్యాలని మా పేరెంట్స్ అనుకున్నారు. దానికి నేనెంతో బాధపడ్డాను. అలాంటి టైమ్‌లో సోనూసూద్ సర్ నన్ను సపోర్ట్ చేశారు. నేను చదువుకోవడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు. ఆయన్ని ఎప్పటికీ మర్చిపోలేను. సోనూ సర్ నాకు దేవుడితో సమానం’ అంటూ ఎమోషనల్‌గా మెసేజ్ పెట్టింది. అంతేకాదు, సోనూ సూద్ ఫోటోకు పాలాభిషేకం చేసి ఆ వీడియోను సోనూ సూద్‌కి షేర్ చేసింది.
దానిపై స్పందించిన సోనూ సూద్ ‘మీరంతా నాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. బాగా చదువుకోండి. కాలేజీ అడ్మిషన్ తీసుకున్నాం. ఈ ఆంధ్రా అమ్మాయి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకునేలా, ఆమె కుటుంబం గర్వపడేలా చేద్దాం. ఈ విషయంలో నాకు మార్గదర్శకంగా నిలిచిన ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుగారికి కృతజ్ఞతలు’ అంటూ ట్వీట్ చేశారు సోనూ సూద్.