తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఘాటుగా స్పందించారు. తాడిపత్రిలో కేతిరెడ్డిని అడుగు పెట్టనివ్వనని, ఒకవేళ వస్తే పంచే ఊడదీసి కొడ్తానని జేసీ ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించిన నేపథ్యంలో ఆయన అక్కడ అడుగు పెట్టడం గమనార్హం. బెయిల్ ష్యూరిటీలు ఇచ్చేందుకు తాడిపత్రి పోలీస్ స్టేషన్‌కు కేతిరెడ్డి పెద్దారెడ్డి వెళ్లారు. బెయిల్ మంజూరై ఐదు రోజులవుతున్నా ష్యూరిటీలు ఎందుకు తీసుకోలేదని పోలీసులను కేతిరెడ్డి నిలదీశారు.
అనంతరం మీడియాతో పెద్దారెడ్డి మాట్లాడుతూ తాడిపత్రి అల్లర్ల కేసులో హైకోర్టు తనకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిందన్నారు. హైకోర్టు ఆదేశాలను లెక్క చేయకుండా, తనను తాడిపత్రికి రాకుండా చేస్తున్నారన్నారు. ఎలాంటి ష్యూరిటీలు ఇవ్వనని, పోలీసులు ఏం చేస్తారో చేసుకోండని జేసీ ప్రభాకర్‌రెడ్డి చెప్పడాన్ని ఆయన గుర్తు చేశారు. పంచె ఊడదీసి కొడతానన్నారన్నారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆస్తుల్లోకి వెళుతుంటే ఏదైనా అనాలన్నారు.
87వేల ఓట్లు తనకు వేశారన్నారు. ఇంత మందిని పెట్టుకుని తనను రానివ్వనని, జిల్లా బహిష్కరణ చేస్తానని జేసీ అనడం ఏంటని ఆయన ప్రశ్నించారు. జేసీ ఏమైనా ముఖ్యమంత్రా? కలెక్టరా? పోలీస్ అధికారా? అని నిలదీశారు. ముందుగా అతని అర్హత ఏంటో జేసీ చెప్పాలన్నారు. వెహికల్స్‌కు సంబంధించి తాను ఫిర్యాదు చేయగా పెట్టిన కేసు కాదన్నారు.
అంతు చూస్తానని జేసీ హెచ్చరించారని, తాము చూస్తూ ఊరుకోడానికి అమాయకులం కాదన్నారు. మీ ఇంటి దగ్గర వంట మనుషులమో, డ్రైవర్లమో కాదని జేసీని ఉద్దేశించి ఆయన అన్నారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి, మరో 10 మందిపై ఆంక్షలు ఉన్నా తాడిపత్రిలో విచ్చలవిడిగా తిరుగుతున్నారన్నారని ఆయన అన్నారు. తాడిపత్రి జేసీ ప్రభాకర్‌రెడ్డి జాగీరు కాదని ఆయన ధ్వజమెత్తారు.
తనను కొడతాననడంపై పెద్దారెడ్డి ఘాటుగా స్పందించారు. తనకు ఏ విధంగా కుటుంబ సభ్యులన్నారో, జేసీకి కూడా అట్లే ఉన్నారన్నారు. కొడితే కొట్టించడానికి తాను అమాయకుడిని కాదన్నారు. తన అన్నను చంపావని, తాను ఆ విధంగా బలి కావడానికి సిద్ధంగా లేనన్నారు.
తిరిగి అదే పరిస్థితి తెచ్చుకోవద్దని జేసీకి పెద్దారెడ్డి హెచ్చరిక చేశారు. రెచ్చగొట్టొద్దనే ఉద్దేశంతో సహనం పాటిస్తున్నట్టు ఆయన తెలిపారు. తనను ఏమైనా చేస్తే, మూల్యం చెల్లించుకుంటావని హెచ్చరించారు. తనను ఏమైనా చేస్తే తన ఇద్దరు కుమారులు, అలాగే అన్న కుమారులు ఉన్నారన్నారు. తన ఊపిరి ఉన్నంత వరకూ తాడిపత్రిలోనే వుంటానని ఆయన తేల్చి చెప్పారు.