వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి స్పీకర్ అయ్యన్నపాత్రుడు ససేమిరా అంటున్నారు. సోమవారం నుంచి ఐదు రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి నిర్ణయించారు. అయితే ఇంత వరకూ అసెంబ్లీలో సీట్ల అలాట్‌మెంట్‌కు స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిసింది. దీంతో వైఎస్ జగన్ సాధారణ ఎమ్మెల్యే మాదిరిగానే అసెంబ్లీలో కూచోవాల్సి వుంటుంది.
వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే వుంది. దీంతో ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు ప్రతిపక్ష హోదా దక్కదని టీడీపీ వాదిస్తోంది. అయితే సీట్లను బట్టి కాకుండా, ప్రత్యర్థి పార్టీ తమదే కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అని జగన్ పట్టుబడుతున్నారు. ఇన్ని సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలనే నిబంధన ఎక్కడా లేదని జగన్ ఉదహరిస్తూ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి గతంలో లేఖ కూడా రాశారు.
కానీ జగన్‌ను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించడానికి టీడీపీ నిరాకరిస్తోంది. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే మాట్లాడేందుకు అవకాశం దక్కదని ఇప్పటికే జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ సమావేశాల మొదటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు.
ఏపీలో చోటు చేసుకుంటున్న హింసాయుత ఘటనలకు నిరసనగా గవర్నర్ ప్రసంగాన్ని వైసీపీ అడ్డుకోనుంది. ఆ తర్వాత అసెంబ్లీకి వెళ్లే అవకాశం వుండకపోవచ్చు. ఎందుకంటే ఢిల్లీలో వైసీపీ ధర్నాకు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే.