ఏపీలో అరాచక పాలనను యావత్ దేశం దృష్టికి తీసుకొచ్చేందుకు వైసీపీ సంకల్పించింది. ఈ సందర్భంగా ఢిల్లీలో 24న ధర్నా చేపట్టాలని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. అధికారాన్ని పోగొట్టుకున్న జగన్‌కు ఇతర పార్టీల్ని కలుపుకెళ్లాలన్న స్పృహ వచ్చింది. ఇది మంచి పరిణామం. అయితే వైసీపీ తనకు అవసరమైనప్పుడు మాత్రమే ఇతర పార్టీల సాయం కోరుతోంది.
అటు వైపు నుంచి స్పందన ఏంటనేది తెలియాల్సి వుంది. ఢిల్లీలో చేపట్టనున్న ధర్నాకు ఇతర పార్టీలకు సంబంధించి ఎవరెవరిని ఆహ్వానిస్తున్నారనే చర్చకు తెరలేచింది. ఇతర పార్టీలను కూడా ఆహ్వానిస్తామని ప్రకటించడం సరైందా? కాదా? అనే చర్చ కూడా లేకపోలేదు. ఒకవేళ ఇతర పార్టీలేవీ రాకపోతే వైసీపీ అభాసుపాలు కావడం ఖాయం.
ఎన్డీఏ కూటమి పక్షాల్ని వైసీపీ ఆహ్వానించలేదు. ఎందుకంటే ఆ కూటమే ఏపీలో అధికారం చెలాయిస్తోంది. ఇండియా కూటమితో జగన్‌కు సత్సంబంధాలు లేవు. ముఖ్యంగా కాంగ్రెస్‌ను ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ఇండియా కూటమిలోని టీఎంసీ, డీఎంకే, శరద్‌పవార్ పార్టీలతో సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. బీజేపీతో జగన్ చెట్టపట్టాలేసుకుని తిరుగుతుండడం వల్ల ఆయనతో ఆ పార్టీలు కలిసొచ్చేందుకు ఏ మేరకు ఆసక్తి చూపుతాయనేదే ప్రశ్న.
గతంలో ఎప్పుడైనా జగన్ ఇతర పార్టీలకు కష్టం వచ్చినపుడు అండగా నిలిచిన దాఖలాలు లేవు. పైగా మోదీకి మద్దతుగా ఒకట్రెండు సందర్భాల్లో కాంగ్రెస్ నాయకుల్ని విమర్శించడానికి జగన్ వెనుకాడలేదు. అందుకే జగన్ చేపట్టే ధర్నాకు ఇతర పార్టీల రాకపై ఉత్కంఠ నెలకుంది.