టీడీపీ సీనియర్ నేత, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు రోజురోజుకూ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు. వైఎస్ జగన్ పేరు వినడానికి కూడా రఘురామ సహించేవారు కాదు. నర్సాపురం లోక్‌సభ స్థానం నుంచి 2019లో వైసీపీ తరపున రఘురామ గెలుపొందారు. ఆ తర్వాత కాలంలో జగన్‌తో ఆయనకు విభేదాలొచ్చాయి. జగన్ కోటరీలోని నలుగురైదుగురు తాము తప్ప, మరెవరూ నాయకుడికి దగ్గర కాకూడదనే కుట్రలో భాగంగానే రఘురామ దూరమయ్యారని వైసీపీ నాయకులు చెబుతుంటారు.
సాధారణంగా అధికార పార్టీలోకి ప్రతిపక్ష పార్టీ నాయకులు వెళుతుంటారు. కానీ రఘురామ ఇందుకు రివర్స్. రఘురామను వైసీపీకి దూరం చేయడంతో పాటు ఆయనపై కేసుల వరకూ జగన్ ప్రభుత్వం వెళ్లింది. తనను చంపాలని చూశారని రఘురామ ఎన్నోసార్లు వాపోయారు. దీంతో జగన్‌ను అభ్యంతరకర భాషలో ఆయన తిడుతూ వచ్చారు. ఇవన్నీ గతం.
వర్తమానంలోకి వస్తే, రెండు రోజుల నాడు అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా జగన్‌ను రఘురామ ఆత్మీయంగా పలకరించారు. అసెంబ్లీ సమావేశాలకు రావాలని కోరానని, ఇందుకు ఆయన సమ్మతించారని రఘురామ చెప్పారు. టీడీపీ అనుకూల చానల్ నిర్వహించిన డిబేట్‌లో జగన్‌ను టచ్ చేసినపుడు ఆయన ఫీలింగ్స్ ఏంటని ప్రజెంటర్ ప్రశ్నించగా, మామూలుగానే ఉన్నారని రఘురామ చెప్పారు.
ఈ నేపథ్యంలో రఘురామకృష్ణంరాజు సోషల్ మీడియాలో ఒక వీడియో విడుదల చేశారు. గతంలో జగన్‌మోహన్‌రెడ్డిని వాడు, వీడు అని తాను అన్నట్టు రఘురామ చెప్పుకొచ్చారు. తనను చంపాలన్న విషయం గుర్తుకొచ్చి ఆవేశంతో, మరో కారణంతోనో అలా మాట్లాడినట్టు ఆయన తెలిపారు. ఇప్పటి నుంచి జగన్‌మోహన్‌రెడ్డి గారు అని పిలుస్తానన్నారు. వయసులో తనకంటే జగన్ చిన్నవాడైనా, స్నేహితుడి కుమారుడు, అలాగే ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన కారణంగా గౌరవంగా పిలుస్తానని ఆయన తెలిపారు.
రఘురామకృష్ణంరాజు వైఖరి టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియాకు జీర్ణం కావడం లేదు. జగన్‌ను నిత్యం తిడుతూ వుండాలనేది వారి కోరిక. పైపెచ్చు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చంద్రబాబు తన సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తారని నర్మగర్భ కామెంట్స్ చేశారు. జగన్‌పై సానుకూల ధోరణి, ఇదే సందర్భంలో చంద్రబాబుపై వ్యతిరేకత రఘురామలో చూడొచ్చు. టీడీపీ ఎమ్మెల్యే అయిన రఘురామలోనే ఇంత తక్కువ సమయంలో భారీ మార్పు కనిపిస్తే, ఇక జనం మాటేంటి? అనే ప్రశ్న ఉత్పన్నమైంది. జగన్‌పై సానుకూల ధోరణి ఏర్పడుతోందనేందుకు రఘురామలో వచ్చిన మార్పే నిదర్శనంగా వైసీపీ ప్రచారం చేస్తుండడం విశేషం.
The post జగన్‌పై సానుకూలత.. రఘురామే నిదర్శనం! appeared first on Great Andhra.