15 వేలు.. రకరకాల కామెంట్లు


నలుగురు గుడ్డి వాళ్లు.. ఏనుగు అన్న కథలా వుంది. అమరావతికి కేంద్రం ఇచ్చిన 15 వేల కోట్ల వ్యవహారం. అప్పు అని కొందరు. సాయం అని మరి కొందరు. భాజ‌పా జ‌నాలు కూడా సరిగ్గా చెప్పలేకపోయారు. పురంధేశ్వ‌రి వగైరా తమకు తోచినది చెప్పేసారు తప్ప కరెక్ట్ కాదని వారికీ తెలుసు.

చివరికి కేంద్ర మంత్రి సీతారామన్ సైతం ఎలా చెప్పారు అంటే మళ్లీ మరింత అయోమయానికి గురయ్యేలా. ప్రస్తుతానికి అప్పు ఇప్పిస్తున్నాం.. చూద్దాం తరువాత ఏం జ‌రుగుతుందో. తీర్చగలరో, తీర్చలేరో అప్పుడు చూద్దాం అనే టైపులో చెప్పారు.

మొత్తానికి అప్పు అనే క్లారిటీని తెలుగుదేశం హార్డ్ కోర్ మద్దతు పత్రిక కూడా చెప్పింది. అయితే ఇప్పుడు తీర్చక్కరలేదు 30 ఏళ్ల తరువాత తీర్చాలి. పైగా వడ్డీ కారు చౌక అంటూ వివరించింది. అంటే మొత్తానికి రాష్ట్రానికి ఇచ్చిన గ్రాంట్ అంటూ ఏమీ లేదు ఈ బడ్జెట్ లో అని అర్ధం అయింది.

బీహార్ కు దాదాపు 60 వేల కోట్లకు పైగా నిధులు నేరుగా ప్రకటించారు. కానీ మనకు మాత్రం అప్పు ఇప్పించడం తప్ప వేరు లేదు. కానీ ఇదే ఘనం అంటూ మీడియా వేనోళ్ల టముకేసారు. తప్పనిసరి పరిస్థితి. ఇప్పుడే విమర్శిస్తే అసలు రావాల్సిన అప్పులు ముందు ముందు అస్సలు రావు కదా.

అమరావతికి నిధులు అవసరమా?

అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ రాజ‌ధాని అని మొదట్లో చంద్రబాబు చెప్పారు. అపార్ట్ మెంట్లు, విల్లాలు కట్టడానికి బిల్డర్లు వాడే భూ సేకరణ మోడల్ ను రాజ‌ధానికి వాడారు చంద్రబాబు. అదో గొప్ప విజ‌న్ అన్నారు. సదరు భూములతోనే వనరులు సమీకరించి రాజ‌ధానిని నిర్మిస్తామని చెప్పారు. మరి ఇప్పుడు వేల కోట్లు కావాలంటున్నారు. అదో చిత్రమైన సంగతి.

ఈ పదిహేను వేల కోట్లతో అమరావతిలో శాశ్వతమైన సెక్రటేరియట్ వగైరా భవనాలు చంద్రబాబు నిర్మిస్తారో లేక వేరే విధంగా వాడతారో చూడాలి.

The post 15 వేలు.. రకరకాల కామెంట్లు appeared first on Great Andhra.



Source link

Leave a Comment