ప్రస్తుతం ‘దేవర’, ‘వార్ 2’ సినిమాలతో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR).. తన తదుపరి సినిమాని ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయనున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి ‘డ్రాగన్’ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు సమాచారం. ఈ ఏడాదే ‘డ్రాగన్’ మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశముంది. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రకి సంబంధించి ఆసక్తికర న్యూస్ వినిపిస్తోంది.
‘డ్రాగన్’లో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడట. అందులో ఒకటి యంగ్ డాన్ రోల్ కాగా, మరొకటి 75 ఏళ్ళ ఓల్డ్ డాన్ రోల్ అట. ఈ రెండు పాత్రల మధ్య తాతమనవడి రిలేషన్ ఉంటుందని తెలుస్తోంది. ఓల్డ్ డాన్ రోల్ సినిమాలో కనిపించేది కాసేపే అయినప్పటికీ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందట. ఈ పాత్ర కోసం ఎన్టీఆర్ ప్రత్యేకంగా మేకోవర్ కానున్నాడని సమాచారం.
ఎన్టీఆర్ ఇప్పటికే కొన్ని సినిమాల్లో ద్విపాత్రాభినయం చేశాడు. తండ్రీకొడుకులుగా, అన్నదమ్ములుగా నటించి మెప్పించాడు. అయితే ఇలా తాతమనవడిగా నటించడం మాత్రం ఇదే మొదటిసారి. ఎలాంటి పాత్రలోనైనా పరకాయప్రవేశం చేయగల ఎన్టీఆర్.. 75 ఏళ్ళ వృద్ధుడి పాత్రలో ఎలా మెప్పిస్తాడో చూడాలి.