ఏపీలో అమరావతి రాజధాని పూర్తి చేయడానికి టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రయత్నాలను వేగవంతం చేసింది. ఈసారి అయిదేళ్ళ కాల పరిమితిగా ఇచ్చిన అధికారంలోగానే అమరావతి రాజధానికి ఒక షేపుకు తీసుకుని రావాలని ప్రభుత్వ పెద్దల ఆలోచనగా కనిపిస్తోంది.
అప్పుగానో గ్రాంట్ గానో కేంద్రం పదిహేను వేల కోట్ల రూపాయలు ఈ ఏడాదికి ఆర్ధిక సాయం చేస్తామని చెప్పింది. రైల్వే లైన్స్ కూడా వేస్తామని రైల్వే మంత్రి హామీ ఇచ్చారు. ఇలా అమరావతి చుట్టూ శుభవార్తలే కూటమి ప్రభుత్వానికి వినిపిస్తున్నాయి.
అంతే కాదు టాప్ మోస్ట్ ప్రయారిటీ కింద అమరావతి రాజధానిని కూటమి ప్రభుత్వం పెట్టుకుందని కూడా అందరికీ తెలిసిందే. అయితే అమరావతి రాజధాని విషయంలో విలువైన సూచనలను విశాఖకు చేసిన మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ అందించారు. కేంద్రం అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయల ఆర్ధిక సాయం చేస్తామని ముందుకు రావడం మంచిదే కానీ అమరావతి రుణాలకు ఎన్నో షరతులు ఉంటాయని శర్మ బాబుకు గుర్తు చేశారు.
ఆ నిధుల వినియోగానికి అనేక షరతులు విధిస్తారని ఆయన అన్నారు. వాటి పట్ల అప్రమత్తంగా ఉండి తీరాల్సిందే అని బాబుని హెచ్చరించారు. నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి ముందస్తు హామీలను తీసుకోవాలని సూచించారు. అలాగే ప్రపంచ బ్యాంక్ ఇతర ఆర్ధిక సంస్థల కన్సార్టియం రాష్ట్రానికి ఇచ్చే నిధులను రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చే నిధులకు అదనంగా కేంద్రం నిధులు విడుదల చేసేలా చూడాలని కోరారు.
అలాగే ప్రపంచ బ్యాంక్ ఇతర అంతర్జాతీయ ఆర్ధిక సంస్థల నుంచి వచ్చే నిధులు డాలర్ల రూపంలో ఉంటాయని వాటి ఎక్సేంజి భారం ఆర్ధికంగా రాష్ట్రం మీద పడకుండా చూసుకోవాలని సలహా ఇచ్చారు. అలాగే కేంద్రం ఇవ్వాల్సిన గ్రాంట్ల వాటా మీద కూడా ముందుగానే హామీ తీసుకోవాలని సూచించారు.
అంతే కాదు ప్రపంచ బ్యాంక్ వంటి సంస్థలు ఇచ్చే రుణాలు పర్యావరణ హితాన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని షరతులు కూడా విధిస్తాయని అలా అమరావతి రాజధానిని పర్యావరణ హితంగా నిర్మించాలని బాబుకు ఆయన సూచించారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ లో అమరావతి ప్రణాళిక మీద 2017లో వేసిన కేసులో ఇచ్చిన అదేశాలను ఎంతవరకు అమలు చేశారు అన్న దానిని కూడా ప్రపంచ బ్యాంక్ ప్రశ్నిస్తుందని ఇవన్నీ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని బాబుకు ఆయన స్పష్టం చేసారు. పర్యావరణం బాగుండేలాగానే కొత్త రాజధాని నిర్మాణం సాగాలని ఆయన కోరారు.