పెళ్లి కావ‌డం లేదు, అయ్యే వాళ్ల‌కు ఆస‌క్తి లేదు! Great Andhra


నిస్సందేహంగా పెళ్లిపై భార‌తీయుల ధోర‌ణి మారుతోంది. ఒక‌వైపు మ‌నుషుల్లో మార్పు, మ‌రోవైపు సామాజిక ప‌రిస్థితులు. ఈ రెండూ పెళ్లి విష‌యంలో ఇండియాలో ప‌రిస్థితుల‌ను పూర్తిగా మార్చేస్తూ ఉన్నాయి. న‌గ‌రాల నుంచి గ్రామాల వ‌ర‌కూ ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే.. రెండు ర‌కాల ధోర‌ణి ఒకే సారి క‌నిపిస్తూ ఉండ‌టం గ‌మ‌నార్హం. ముందుగా గ్రామీణ నాగ‌రిక‌త వైపు చూస్తే అక్క‌డ అబ్బాయిల‌కు పెళ్లి చాలా క‌ష్టం అయిపోయింది. గ్రామీణ నేప‌థ్యం నుంచి వ‌చ్చిన అబ్బాయిల ప‌రిస్థితిని చూస్తే.. నూటికి ఇర‌వై ముప్పై మందికి పెళ్లి జ‌రుగడం అనేది సందేహాంగా మారిపోయింది. వారు చేసుకోవాల‌నే ప్ర‌య‌త్నాల్లోనే ఉన్నా.. వివిధ ర‌కాల సామాజిక ప‌రిస్థితులు వారిని పెళ్లికి దూరం చేస్తూ ఉన్నాయి.

ఇందులో ప్ర‌ధాన‌మైన‌ది.. స్త్రీ, పురుష జ‌నాభా నిష్ఫ‌త్తిలో తేడాలు ఉండాయ‌నుకోవాలి. ఇండియాలో ఇప్పుడు 30 యేళ్ల వ‌య‌సు లో ఉన్న అబ్బాయిల‌కు త‌గిన రీతిలో 25 యేళ్ల వ‌య‌సున్న అమ్మాయిల జ‌నాభా ఎంత అనేది క‌రెక్టుగా లెక్క తీసే వారు ఎవ‌రూ లేరు!

క‌నీసం తెలుగు రాష్ట్రాల వ‌ర‌కూ అయినా ఇలాంటి ప‌ని ఎవ‌రైనా చేస్తే మంచిదే! చాలా మంది అబ్బాయిల‌కు సంబంధాలు దొర‌క‌డం లేదు. భారీ జీతం వ‌చ్చే ఉద్యోగం, దానికి తోడు ఎక‌రాల కొద్దీ భూములే అర్హ‌త‌లు త‌ప్ప అబ్బాయిల పెళ్లికి ఇంకే అర్హ‌త‌లూ చెల్ల‌కుండా పోయాయి. దీంతో చాలా మందికి చూద్దామ‌న్నా.. పెళ్లి చూపుల అవ‌కాశాలు కూడా రావ‌డం లేదు. ప్రొఫైల్ ద‌గ్గ‌రే తిర‌స్క‌ర‌ణ జ‌రిగిపోతూ ఉంది.

ఇక పెళ్లి చూపుల వ‌ర‌కూ వెళితే అక్క‌డ అబ్బాయిల గొంతెమ్మ కోరిక‌ల‌కూ హ‌ద్దు లేకుండా పోతోంది. వారు అలా కోర‌డానికి కార‌ణం కూడా పరిస్థితులే. త‌మ స్థాయికి మించిన చాలా పెద్ద సంబంధాలు కూడా వెదుక్కొంటూ వ‌స్తున్న‌ప్పుడు అమ్మాయిలు, వారి త‌ల్లిదండ్రులు కూడా త‌మ కోరిక‌ల్లో త‌ప్పు లేద‌నే భావ‌న‌తోనే క‌నిపిస్తూ ఉన్నారు.

ఈ ప‌రిస్థితుల వ‌ల్ల ఓ మాదిరి జీతం పొందే అబ్బాయిల‌కు పెళ్లి ప్ర‌య‌త్నాలు కూడా వేస్ట్ అయిపోతూ ఉన్నాయి. అతిగా రాజీ ప‌డి ఎవ‌రో ఒక‌రు అన్న‌ట్టుగా చేసుకుంటే ఫ‌ర్వాలేదు, లేదంటే బ్ర‌హ్మ‌చ‌ర్య‌మే అనే ప‌రిస్థితి క‌నిపిస్తూ ఉంది. ఇక ఏవో గొడ‌వ‌లు జరిగి విడాకులు తీసుకున్న అమ్మాయిల‌కు కూడా ఇప్పుడు ఫ‌స్ట్ హ్యాండ్ మొగుడు దొరికే పరిస్థితి క‌నిపిస్తూ ఉంది. విడాకులు తీసుకున్న అమ్మాయినైనా స‌రే పెళ్లి చేసుకుంటామ‌నేంత స్థాయి ప‌రిణ‌తిని తీసుకొచ్చాయి ఈ ప‌రిస్థితులు!

ఏపీలోని ఏ గ్రామీణ ప్రాంతానికి వెళ్లి చూసినా.. వంద మంది యువ‌కుల్లో 20 నుంచి 30 మందికి పెళ్లి క‌ష్టం అయిపోయింది. వీరిలో స‌గం మంది ఇక పెళ్లి కాద‌నే భావ‌న‌కు వ‌చ్చిన‌ట్టుగా ఉన్నారు. వారి వ‌య‌సు 30 దాటేస్తూ ఉంది. అంత‌కు మించి దాటిన వారు కూడా చాలా మంది బ్ర‌హ్మ‌చారులుగా మిగిలారు కూడా! దీంతో రానున్న రోజుల్లో ప్ర‌తి వంద మందికీ క‌నీసం 20 మంది అబ్బాయిలు బ్ర‌హ్మ‌చారులుగా మిగిలిపోయినా అది సామాజికంగా పెద్ద ప‌రిణ‌మ‌మే అవుతుంది! ఇండియా వంటి పెద్ద దేశంలో వంద‌కు ఇర‌వై మంది అంటే అది భారీ నంబ‌రే అవుతుంది.

ఇది నాణేనికి ఒక‌వైపు. ఇక మహాన‌గ‌రాల్లో ఉన్న నాగ‌రిక‌త‌ను తీసుకుంటే.. ఇక్క‌డ అమ్మాయిల్లో ఇంకా చెప్పాలంటే అబ్బాయిల్లో కూడా వివాహంపై మోజులేమీ లేవు! పెళ్లి అనేక బాధ్య‌త‌ల‌ను భుజ‌నా వేస్తుంద‌ని, హ్యాపీగా గ‌డుపుతున్న‌ప్పుడు ఇక ఆ పెళ్లితో ఎందుకు త‌ల భారాన్ని ఎత్తుకోవాల‌న్న‌ట్టుగా న‌గ‌రాల ధోర‌ణి క‌నిపిస్తూ ఉంది. ప్ర‌త్యేకించి సిటీ బేస్డ్ అమ్మాయిల్లో 30 వస్తున్నా పెళ్లిపై అనాస‌క్తే క‌నిపిస్తూ ఉండ‌టం గ‌మ‌నార్హం. అమ్మాయిలో ఈ అనాస‌క్తికి కార‌ణాలు ఏవైనా.. ఇది కూడా సామాజికంగా ఒక ప‌రిణమంగానే క‌నిపిస్తూ ఉంది. చ‌క్క‌గా ఉండి, చ‌దువుకుని, ఉద్యోగం చూసుకుంటూ పెళ్లిపై పెద్ద తాప‌త్రయం అయితే వీరిలో క‌నిపించ‌దు. మ‌రీ ఏదో ల‌వ్ ఎఫైర్ ఉంటే… అది కూడా కొంద‌రు క‌లిసి ఉండ‌టంతో ఆస‌క్తిని తీర్చేసుకోవ‌డం, మ‌రీ కుటుంబం ఒత్తిడి ఉంటేనే పెళ్లి ప‌ట్ల ఆస‌క్తి చూపుతూ ఉన్నారు!

ఇలా భిన్న‌మైన ధోర‌ణులు భార‌త‌దేశంలో క‌నిపిస్తూ ఉన్నాయి. గ్రామాల్లో వ్య‌వ‌సాయం మీద ఆధార‌ప‌డ్డ వాళ్ల‌కు పెళ్లి ఊసే లేకుండా పోతోంది. వారికి పిల్ల‌ను ఇచ్చే వారు కాదు క‌దా, క‌నీసం పెళ్లి చూపుల‌కు పిలిచే వాళ్లు కూడా లేరు. ఓ మోస్త‌రు జీత‌భ‌త్యాలు పొందే వారికి నానా క‌ష్టాలు ప‌డితేనే పెళ్లి అవుతోంది. లేదంటే లేదు! అమ్మాయిల్లో కొంత శాతం అస‌లు పెళ్లి ప‌ట్లే ఉత్సాహంతో లేరు. ఏతావాతా ఇలాంటి వారి శాతాల‌ను జ‌నాభా లెక్క‌ల్లో తేల్చితే పెళ్లి ఊసు లేకుండా జీవితాన్ని గ‌డిపేస్తున్న ప‌రిస్థితుల్లో ఉన్న వారి శాతం గ‌ట్టినే తేలే అవ‌కాశం ఉంది. ఇది సామాజికంగా పెద్ద ప‌రిణామ‌మే!

-హిమ‌



Source link

Leave a Comment