మీడియాలో ఒక వార్త హల్ చల్ చేస్తోంది. ఇది తెలంగాణకు కొత్త గవర్నర్ నియామకం గురించిన వార్త. మీడియాలో వస్తున్న వార్తలు లేదా కథనాలు కాస్త ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి. ఈ ఆందోళన ప్రజలకు సంబంధించి కాదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి. కొత్త గవర్నర్ వస్తుంటే మీడియాకు ఆందోళన ఎందుకు? అనే ప్రశ్న రావొచ్చు.
ఎందుకంటే గవర్నర్ గా వస్తున్న వ్యక్తి హార్డ్ కోర్ బీజేపీ లీడర్ కాబట్టి. ఈ సందర్భంగా కేసీఆర్ పాలనను గుర్తు చేసుకుంటున్నారు. ఆయన హయాంలో గవర్నర్ గా ఉన్నదెవరు? తమిళనాడు బీజేపీ లీడర్ డాక్టర్ తమిళిసై. ఆమె కూడా ఆ రాష్ట్రంలో యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నారు. ఆ సమయంలోనే ఆమెను కేంద్ర ప్రభుత్వం తెలంగాణాకు గవర్నర్ గా పంపింది.
ఆమె గవర్నర్ గా వచ్చి ఎన్నికల్లో పోటీ చేయడానికి వెళ్లిపోయేంత వరకు కేసీఆర్ ప్రభుత్వానికి – ఆమెకు మధ్య ఎలాంటి “సత్సంబంధాలు” ఉన్నాయో అందరికీ తెలుసు. సీఎం, గవర్నర్ ఉప్పు – నిప్పులా ఉండేవారు కదా. ఇద్దరి మధ్య వివాదం లేనిరోజు ఉందా? కేసీఆర్ ఆమెను గవర్నర్ గా కాకుండా బీజేపీ నాయకురాలిగానే చూశాడు. అనేకసార్లు ఆమెను అవమానించాడు. ప్రోటోకాల్ పాటించలేదు. మర్యాద ఇవ్వలేదు.
కేసీఆర్ సర్కారు బిల్లులకు ఆమె ఆమోదం తెలపకుండా తొక్కిపెట్టింది. జాప్యం చేసింది. చివరకు దీనిపై కోర్టుకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. తమిళిసై ఒక తెలుగు టీవీ ఛానెల్ కు ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది. కొన్ని కార్యక్రమాలను కూడా కేసీఆర్, తమిళిసై వేరువేరుగా నిర్వహించారు. ఆమె కేసీఆర్ ను తిప్పలు పెట్టింది. ఆయన ఆమెకు చుక్కలు చూపించాడు. రాష్ట్రంలో ఇదొక భయంకరమైన ఎపిసోడ్ అని చెప్పొచ్చు.
కేసీఆర్ చాలా హ్యాపీగా ఉన్నది ఈఎస్ఎల్ నరసింహన్ గవర్నర్ గా ఉన్నప్పుడే. కేసీఆర్ ఏం చేసినా ఆయన నో చెప్పలేదు. ఇప్పుడు మళ్ళీ తమిళిసై – కేసీఆర్ హయాం రిపీట్ అవుతుందేమోనని మీడియాలో ఆందోళన వ్యక్తమవుతోంది. నిజానిజాలేమిటో మనకు తెలియవుగానీ రేవంత్ రెడ్డి సర్కారును ఇబ్బంది పెట్టడానికే కొత్త గవర్నర్ గా జిష్ణు దేవ్ వర్మను పంపుతున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మొన్న ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం జరగడం, తెలంగాణకు కేంద్ర బడ్జెట్ లో నిధులు కేటాయించనందుకు నిరసన వ్యక్తం చేస్తూ రేవంత్ రెడ్డి ఆ సమావేశానికి వెళ్ళకపోవడం, మోడీపై ఘాటు విమర్శలు చేయడం తెలిసిందే. ఇదంతా జరిగిన వెంటనే రాష్ట్రానికి కొత్త గవర్నర్ ను నియమించారు. అది కూడా కరడుగట్టిన బీజేపీ నేతను.
త్రిపురకు చెందిన వర్మ అక్కడ ఉప ముఖమంత్రిగా కూడా పనిచేశారు. మోడీకి పరమ విధేయుడని చెబుతున్నారు. తమిళిసై వైద్యురాలైతే, వర్మ కవి, రచయిత. ఆయన కొన్ని పుస్తకాలు ప్రచురించారు. ఈ మధ్యనే “వ్యూస్, రివ్యూస్ అండ్ మై పోయమ్స్” ప్రచురించారు. తెలంగాణ ఏర్పాటయ్యాక ఈయన నాలుగో గవర్నర్. మరి ఈయన హయాం ఎలా ఉంటుందో చూడాలి.