ఈకాలం ఎవ్వరు, ఎప్పుడు, ఎలా ట్రోలింగ్ కు గురవుతారో చెప్పలేని పరిస్థితి. తమ ప్రమేయం లేకపోయినా తిట్లు తింటుంటారు చాలామంది ప్రముఖులు. మొన్నటికిమొన్న నాగార్జున విషయంలో అదే జరిగింది. ఇప్పుడు చిరంజీవి కూడా అదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు.
పారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవానికి కుటుంబ సమేతంగా వెళ్లిన చిరంజీవి హైదరాబాద్ వచ్చారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమానం దిగారు. ఇంటికెళ్లే హడావుడిలో ఉన్నారు.
సరిగ్గా అదే టైమ్ లో ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బంది ఒకరు చిరంజీవితో సెల్పీ దిగేందుకు ప్రయత్నించాడు. అయితే అప్పటికే ఇంటికెళ్లే ఆత్రుతలో ఉన్న చిరంజీవి, తనకు అడ్డంగా వచ్చిన ఆ ఉద్యోగి వీపు మీద చేయి వేసి మెల్లగా ముందుకు నెట్టారు.
ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అభిమాని అడిగితే సెల్ఫీ కూడా ఇవ్వని చిరంజీవి అంటూ అప్పుడే కొంతమంది ట్రోలింగ్ మొదలుపెట్టారు. మరికొంతమంది మాత్రం చిరంజీవిని వెనకేసుకొచ్చారు.
మొన్నటికిమొన్న నాగార్జున విషయంలో కూడా ఇదే జరిగింది. ముంబయి ఎయిర్ పోర్టులో హడావుడిగా వెళ్తున్న నాగార్జునతో సెల్ఫీ దిగేందుకు విమానాశ్రయంలో పనిచేసే ఏ వ్యక్తి ప్రయత్నించాడు. ఆ విషయం నాగార్జునకు కూడా తెలిసేలోపే, అతడి సిబ్బంది సదరు వ్యక్తిని పక్కకు తోసేశారు.
తర్వాత విషయం తెలుసుకున్న నాగార్జున, తన తప్పు లేకపోయినా సారీ చెప్పారు. మరోసారి ముంబయి వెళ్లినప్పుడు, ఆ వ్యక్తిని దగ్గరకు పిలిపించుకొని మరీ అతడితో సెల్ఫీ దిగారు.