రైల్వేజోన్ విషయంలో కేంద్రానిదే ఆలస్యం!


విశాఖ రైల్వే జోన్ విషయంలో ప్రతీ సారీ కొర్రీ వేస్తున్నట్లుగా ఒక సమస్యని తెస్తున్నారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ని ఏర్పాటు చేయడానికి తగిన భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించలేదన్న వాదనను తెర మీదకు తెస్తున్నారు. గత అయిదేళ్ళూ వైసీపీ పాలనలో ఇదే విధంగా కేంద్రం నుంచి స్పందన వచ్చేది. అయితే ఆనాడే రాష్ట్ర ప్రభుత్వం భూములను కేటాయించామని చెప్పింది. అయినా సరే రైల్వే జోన్ ఒక్క అడుగు ముందుకు కదలలేదు. భూముల సమస్య ఉందని ఇటీవల కూడా కేంద్ర రైల్వే మంత్రి మీడియాకు చెప్పారు.

ఇప్పుడు ఆ సమస్య కూడా లేదని తేలిపోయింది. విశాఖ రైల్వే జోన్ కి అవసరమైన భూములను టీడీపీ కూటమి ప్రభుత్వం కేటాయించినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం కోరిన మేరకు ఇవ్వాల్సిన భూములను అప్పగించినట్లుగా చెబుతున్నారు.

ఇప్పుడు కేంద్రం మీదనే బాధ్యత ఉందని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన భూములలో కేంద్రం భారీగా నిధులను విడుదల చేసి సాధ్యమైనత తొందరలో విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ని ఏర్పాటు చేయాలని అంటున్నారు.

గతంలోనూ విశాఖలో రైల్వే శాఖకు భూములు ఉన్నాయని పని ప్రారంభించమని వామపక్షాలు కోరినా కేంద్రం నుంచి ఆశించిన స్పందన రాలేదు. ఇపుడు రాష్ట్ర ప్రభుత్వమే భూములను అప్పగించిన నేపధ్యంలో రైల్వే జోన్ మీద వేగంగా అడుగులు పడాల్సిందే అని వామపక్ష నేతలు అంటున్నారు.

భూముల సమస్య లేదు కాబట్టి ఇక కేంద్రం తప్పించుకునే అవకాశం లేదని ప్రజాసంఘాల నేతలు కూడా అంటున్నారు. అందువల్ల విశాఖ రైల్వే జోన్ విషయంలో కేంద్రం చిత్తశుద్ధిని చాటుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అంటున్నారు. దాదాపుగా అయిదారు వేల కోట్ల రూపాయలు రైల్వే జోన్ ఏర్పాటుకు అవసరం అయి ఉండగా ప్రతీ బడ్జెట్ లోనూ అరకొరగా వందల కోట్ల నిధులనే కేటాయిస్తూ వస్తున్నారు.

ఇప్పుడు రైల్వే జోన్ కోసం ప్రత్యేకంగా నిధులను పూర్తిగా విడుదల చేస్తారా లేదా అన్నది చూడాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి తొందరగా విశాఖ వాసుల రైల్వే జోన్ కలను నెరవేర్చే విధంగా చూడాలని అంటున్నారు.

The post రైల్వేజోన్ విషయంలో కేంద్రానిదే ఆలస్యం! appeared first on Great Andhra.



Source link

Leave a Comment