ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వర్గీకరణను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురి బెంచ్ సమర్ధించడం విశేషం. వర్గీకరణ విషయంలో 2004లో ఇచ్చిన తీర్పును పక్కన పెట్టింది. ఇదిలా వుండగా వర్గీకరణను జస్టిస్ బేలా త్రివేది వ్యతిరేకించారు.
విద్య, ఉద్యోగాల్లో వర్గీకరణ అమలుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టవచ్చని సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో పేర్కొనడం గమనార్హం. వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కృష్ణమాదిగ సుదీర్ఘ కాలంగా పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ హైదరాబాద్ బహిరంగ సభలో ఎస్సీ వర్గీకరణ చేపడతామని హామీ ఇచ్చారు. అందుకే మాదిగలు ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చారు. ఇవేమీ పట్టించుకోకుండా మెజార్టీ మాలలు కూడా ఎన్డీఏ కూటమికి మద్దతుగా నిలిచారు.
తాజా తీర్పుతో మాలలు ఎలా వ్యవహరిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఉప వర్గీకరణకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మాలలు స్వాగతించే పరిస్థితి వుండకపోవచ్చని అంటున్నారు.