ప్ర‌తిప‌క్షంలో ఉన్నా జ‌గ‌న్‌ను క‌ల‌వ‌నీయ‌క‌పోతే ఎట్లా?


ముఖ్య‌మంత్రి స్థానంలో వైఎస్ జ‌గ‌న్ ఉన్న‌ప్పుడు క‌ల‌వ‌నీయ‌లేదని, ఇప్పుడు ప్ర‌తిప‌క్షంలో ఉన్నా అదే ప‌రిస్థితి ఉంటే…. వైసీపీకి మ‌నుగ‌డ ఎట్లా వుంటుంద‌ని నాయ‌కులు ఆవేద‌న చెందుతున్నారు. అంబేద్క‌ర్ విదేశీ విద్యా ప‌థ‌కానికి సంబంధించి ప్ర‌స్తుత ప్ర‌భుత్వ తీరును జ‌గ‌న్ దృష్టికి తీసుకెళ్లేందుకు చేసిన ప్ర‌య‌త్నాలు విఫ‌లం కావ‌డంపై ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా గోపాల‌పురం నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన కారుమంచి ర‌మేశ్ తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

కారుమంచి ర‌మేశ్ ఎమ్మెల్సీ స్థాయి నాయ‌కుడ‌ని స‌మాచారం. సోష‌ల్ మీడియాలో ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేస్తూ పోస్టులు పెట్టారు. ర‌మేశ్ పోస్టుపై వైసీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు కూడా పాజిటివ్‌గా స్పందించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

“ఒక ఆడ‌పిల్ల పాపం శ్రీ‌కాకుళం నుంచి వెళ్లి జ‌గ‌న్ గారి ఇంటి ద‌గ్గ‌ర రెండు రోజులు వెయిట్ చేసింది. జ‌గ‌న్ వ‌చ్చాక క‌లిపిద్దామ‌ని ప్ర‌య‌త్నించినా మ‌న వ్య‌వ‌స్థ స్పందించ‌లేదు. ఏం చేస్తాం బాధ‌ప‌డ‌డం త‌ప్ప‌”

“అంబేద్క‌ర్ విదేశీ విద్య ప‌థ‌కం గురించి స్థానిక ఎమ్మెల్యేని, లోకేశ్‌ని క‌లిసినా వాళ్లు ఈ ఏడాదికి ఏమీ చేయ‌లేమ‌ని, వ‌చ్చే ఏడాది చేద్దామ‌ని చెప్పార‌ట‌. జ‌గ‌న్ అన్న‌ను క‌లిసి చెబుదామ‌ని వెళ్లింది కానీ, క‌ల‌వ‌లేక‌పోయింది. అధికారంలో ఉన్న‌ప్పుడు క‌ల‌వ‌లేక‌, ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు క‌ల‌వ‌లేక‌పోతే ఎట్లా?”

“ఈ గ్రూప్‌లో ఆ అమ్మాయికి సంబంధించిన వివ‌రాలు పోస్టు చేశా. చూసే వుంటారుగా నీతులు చెప్పే కొంత మంది. సిగ్గు ప‌డ‌దాం ఇలాంటి పార్టీ వ్య‌వ‌స్థ మ‌న‌కు ఉన్నందుకు. ఎన్నిసార్లు చెప్పినా ప‌ట్టించుకోని మ‌న వ్య‌వ‌స్థ‌ను చూసి సిగ్గేస్తోంది”

“ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న వాళ్లు లోకేశ్ కూడా ప‌ని అవ్వ‌దు అన్న దానిని మ‌నం వాడుకోవాలి క‌దా”

“నేను ఓఎస్డీ కృష్ణ‌మోహ‌న్‌రెడ్డి, కేఎన్నార్‌, స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి, స‌జ్జ‌ల భార్గ‌వ్‌రెడ్డికి అమ్మాయికి సంబంధించిన వివ‌రాలు వాట్స‌ప్‌లో వివ‌రాలు పంపా. నో రెస్పాన్స్” అని ఒక కార్య‌క‌ర్త ప్ర‌శ్న‌కు స‌మాధానంగా కారుమంచి ర‌మేశ్ రిప్లై ఇవ్వ‌డం విశేషం.

జ‌గ‌న్ చుట్టూ వున్న వాళ్లు ఆయ‌న అధికారాన్ని, ప‌లుకుబ‌డిని సొంత ప్ర‌యోజ‌నాల‌కు వాడుకుంటున్నార‌నేది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. మ‌రీ ముఖ్యంగా పార్టీకి ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ఎవ‌రైనా జ‌గ‌న్‌ను క‌ల‌వాల‌ని అనుకుంటే అది సాధ్యం కావ‌డం లేదు. ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం ఎన్న‌డో, అస‌లు ఉందో లేదో కూడా తెలియ‌ని ప‌రిస్థితి.

The post ప్ర‌తిప‌క్షంలో ఉన్నా జ‌గ‌న్‌ను క‌ల‌వ‌నీయ‌క‌పోతే ఎట్లా? appeared first on Great Andhra.



Source link

Leave a Comment