సినిమా పేరు: అలనాటి రామచంద్రుడు
తారాగణం: కృష్ణ వంశీ, మోక్ష, వెంకటేష్ కాకుమాను, చైతన్య గరికపాటి, సుధ, బ్రహ్మజీ, ప్రమోదిని, కేశవ్ దీపక్ తదితరులు
సంగీతం: శశాంక్ తిరుపతి
డీఓపీ: ప్రేమ్ సాగర్
ఎడిటర్: శ్రీకర్
రచన, దర్శకత్వం: చిలుకూరి ఆకాశ్ రెడ్డి
నిర్మాతలు: హైమావతి, శ్రీరామ్
బ్యానర్: హైనివా క్రియేషన్స్
విడుదల తేదీ: ఆగస్టు 2, 2024
కృష్ణ వంశీ, మోక్ష జంటగా చిలుకూరి ఆకాశ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అలనాటి రామచంద్రుడు’. క్లాస్ టైటిల్, ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. (Alanaati Ramachandrudu Movie Review)
కథ:
సిద్ధు(కృష్ణ వంశీ) మొహమాటస్తుడు. ఇంట్రోవర్ట్ అనే పదానికి పర్ఫెక్ట్ ఎగ్జామ్పుల్. అలాంటి సిద్ధు, తనకి పూర్తి భిన్నంగా ఉండే ధరణి(మోక్ష)తో ప్రేమలో పడతాడు. కానీ మొహమాటం వల్ల తన ప్రేమను వ్యక్తపరచలేడు. ఎన్నోసార్లు చెప్పాలని ప్రయత్నించి విఫలమవుతాడు. ఇక ఎలాగైనా తన ప్రేమని చెప్పాలని నిర్ణయించుకున్న సమయంలో.. ధరణి మరొక వ్యక్తిని ఇష్టపడుతుందని తెలిసి ఆగిపోతాడు. అయితే, ధరణి తాను ప్రేమించిన అబ్బాయితో కలిసి మనాలి వెళ్ళాలి అనుకుంటుంది. కానీ అతనికి బదులుగా సిద్ధు వెళ్తాడు. అక్కడ ధరణి గతం మర్చిపోతుంది. అసలు ధరణితో కలిసి సిద్ధు మనాలి ఎందుకు వెళ్ళాడు? ధరణి గతం మర్చిపోవడానికి కారణమేంటి? ఆమెకి మళ్ళీ గతం గుర్తు వచ్చిందా? సిద్ధు ప్రేమకథ ఎలాంటి మలుపులు తిరిగింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ:
ప్రస్తుతం ప్రేమ కథలు కూడా బూతు కథలుగా మారిపోతున్నాయి. లవ్ స్టోరీ అంటే మూడు ముద్దులు, ఆరు బూతులు అన్నట్టుగా కొందరు మేకర్స్ సినిమాలు తెరకెక్కిస్తున్నారు. ఇలాంటి ట్రెండ్ లో ‘అలనాటి రామచంద్రుడు’ లాంటి క్లాస్ టైటిల్ తో, ‘రాముడు మంచి బాలుడు’ లాంటి హీరో క్యారెక్టర్ తో నిజాయితీగా ప్రేమ కథను చెప్పాలనుకోవడం సాహసమనే చెప్పాలి. ఆ విషయంలో దర్శకుడు చిలుకూరి ఆకాశ్ రెడ్డిని మెచ్చుకోవాలి. రాముడి లాంటి పాత్రతో ఓ అందమైన కథను చెప్పాలనుకున్న దర్శకుడు.. అంతే అందంగా ఆ కథను తెరమీదకు తీసుకురావడంలో మాత్రం పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు. హీరోయిన్ తో హీరో ప్రేమలో పడటం, తన మొహమాటం కారణంగా ప్రేమను చెప్పలేక ఇబ్బంది పడటం వంటి సన్నివేశాలతో ప్రథమార్థం సరదాగా నడిచింది. ఎమోషన్ సీన్స్ కూడా పండాయి. బ్యూటిఫుల్ విజువల్స్, మ్యూజిక్, క్యూట్ సీన్స్ తో ఫస్టాఫ్ బాగానే అనిపిస్తుంది. కానీ సెకండాఫ్ లో మాత్రం గ్రాఫ్ పడిపోయింది. ప్రేక్షకులకు నీరసం తెప్పించేలా కథనం మరీ నెమ్మదిగా సాగింది. అందమైన సన్నివేశాలతో కథనాన్ని మరింత ఆసక్తికరంగా రాసుకొని ఉంటే.. అవుట్ పుట్ మెరుగ్గా ఉండేది.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:
సిద్ధు పాత్రలో కృష్ణ వంశీ చక్కగా ఒదిగిపోయాడు. అతని నటన సహజంగా ఉంది. ధరణి పాత్రలో మోక్ష ఆకట్టుకుంది. వెంకటేష్ కాకుమాను, చైతన్య గరికపాటి, సుధ, బ్రహ్మజీ, ప్రమోదిని, కేశవ్ దీపక్ తదితరులు తమ పాత్రలకు తగ్గట్టు చేశారు.
ఈ సినిమాకి ప్రధాన బలం సంగీతమని చెప్పవచ్చు. శశాంక్ తిరుపతి తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడు. పాటలు, నేపథ్య సంగీతం కట్టిపడేశాయి. ప్రేమ్ సాగర్ కెమెరా పనితనం కూడా మెప్పించింది. ఎడిటింగ్ ఓకే. సెకండాఫ్ ఇంకా షార్ప్ చేయాల్సింది. నిర్మాణాలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ఫైనల్ గా చెప్పాలంటే…
ప్రథమార్థంలో అలరించిన రామచంద్రుడు.. ద్వితీయార్థంలో తేలిపోయాడు. కాస్త సహనం ఉంటే.. సున్నితమైన, స్వచ్ఛమైన ప్రేమకథలను ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది.
రేటింగ్: 2.5/5
– గన