ఆంధ్ర రాజకీయాలు విచిత్రంగా ఉన్నాయి. ఫలితాలు వచ్చి రెండు నెలలైంది. పథకాలు నమ్మి జగన్ మునిగిపోయారు. పథకాలు రెట్టింపు ఇస్తానని వచ్చిన చంద్రబాబు నీళ్లు నములుతున్నాడు. లోకేశ్ సైలెంట్‌గా రెడ్ బుక్ అమలు చేస్తున్నాడు. పవన్‌కల్యాణ్ ఇంకా అధ్యయనంలో వున్నాడు. చిన్నాచితకా పదవుల కోసం జనసేన, బీజేపీ నాయకులు కాచుక్కూచున్నారు. వామపక్షాలు పత్రికా ప్రకటనకే పరిమితమయ్యాయి. ఒకటో తేదీ జీతం తీసుకున్న ఉద్యోగులు సంతోషంగా ఉన్నారు. అవ్వాతాతల పెన్షన్ అందింది కానీ, రిటైర్డ్ ఉద్యోగుల పింఛన్ ఇంకా పూర్తిగా అందలేదు.
రెండు నెలల్లో జగన్ ఓడిపోయిన నాయకుల్ని కలిసాడు. వినుకొండ వెళ్లాడు. ఢిల్లీలో ధర్నా చేసాడు. ఆశ్చర్యంగా మీడియాతో మాట్లాడాడు. వైసీపీ కార్యకర్తల్ని కాపాడుకుంటానని చెప్పాడు. ఓటమి వల్ల తానేం కుంగిపోలేదని, గట్టిగానే పోరాడుతానని టీడీపీకి సందేశం పంపాడు.
అయితే జగన్ శైలిని గమనించిన వాళ్లకి ఆయనేం మారలేదు, ఆత్మపరిశీలన చేసుకోడని అర్థమవుతోంది. ఇంకా అదే సలహాదారులు, అవే ముఖాల్ని చుట్టూ పెట్టుకుని రాజకీయాలు చేయాలని భావిస్తున్నాడు. తన ఓటమికి జనం కాదు, ఈవీఎంలే కారణమని నమ్ముతున్నట్టుంది. రాజకీయ భీష్ములైన ఉండవల్లి, కేవీపీ లాంటి మేధావులు, వ్యూహకర్తల అవసరం జగన్‌కి వుంది. అది గుర్తించకుండా తాను, తన కోటరీ అనుకుంటే ఆ పార్టీని ఎవరూ కాపాడలేరు. చంద్రబాబు వైఫల్యం కోసం జగన్ కాచుక్కూచున్నాడు. జగన్ దయవల్ల జైలు జీవితం చూసిన బాబు, ఈ సారి అంత ఈజీగా అవకాశం ఇవ్వడు. ఇచ్చినా జగన్ అహంకారం అది గుర్తించదు.
చంద్రబాబు విషయానికి వస్తే ప్రమాణ స్వీకారం తర్వాత ఒక్క రోజు కూడా చంద్రబాబు విశ్రాంతి తీసుకోలేదు. ఈ వయసులో కూడా రాష్ట్రమంతా తిరుగుతున్నాడు. ముఖ్యమంత్రి మీడియా ముందు కానీ, జనం ముందు కానీ నిరంతరం కనిపిస్తున్నాడు. అది జగన్‌కి, బాబుకి తేడా.
చంద్రబాబు వస్తే పరదాలు, చెట్లు నరకడం లేదు. జనానికి ఏ ఇబ్బంది లేదు. ఒకసారి దాడికి గురైన చంద్రబాబే ప్రజల్లోకి నిర్భయంగా వస్తూ వుంటే , జగన్ జనంలోకి రాకుండా తాడేపల్లిలో విశ్రాంతి తీసుకున్నాడు. జనం కూడా ఐదేళ్లు విశ్రాంతి ఇచ్చారు.
పరిపాలనని అంచనా వేయడానికి రెండు నెలలు చాలా తక్కువ సమయం. అయితే బాబు మాట్లాడే మాటలు, పథకాల విషయంలో అపనమ్మకం కలిగిస్తున్నాయి. నేను మీకు చాలా చేయాలనుకున్నాను. అయితే ఖజానాలో రూపాయి లేదు అంటున్నారు. అర్థం ఏమంటే నేనిచ్చిన వాగ్దానాలు అమలు చేయలేను. అర్థం చేసుకుని ఒత్తిడి చేయకండి అని ఇన్‌డైరెక్ట్‌గా చెబుతున్నాడు.
వృద్ధాప్య పింఛన్లు ఇస్తున్నాడు. అయితే త్వరలోనే తీవ్రమైన వడపోత వుంటుంది. అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తారు. మరీ భారం కాదు కాబట్టి నెట్టుకొస్తారు. మెగా డీఎస్సీ లాగించేస్తారు. ఎందుకంటే వచ్చే జూన్ నాటికి వేల మంది టీచర్లు రిటైర్డ్ అవుతున్నారు. విద్యాశాఖకి అవసరం కూడా. కానీ రిటైర్డ్ అయిన ఉద్యోగులకి పీఎఫ్, ఇతర బెన్పిట్లకి ఖజానాలో డబ్బులున్నాయా? వుంటాయా? అది ప్రశ్న.
సమస్య వచ్చేదల్లా తల్లికి వందనం (ఇది వచ్చే ఏడాదే అని స్పష్టం చేశారు). మూడు సిలిండర్లు, రైతుకు సాయం, ఉచిత ప్రయాణం, మహిళలకు రూ.1500. ఇవి భారీ పథకాలు. దీంట్లో ఉచిత ప్రయాణం కొంత సులువు. ఆర్టీసీకి వెంటనే చెల్లించక్కర్లేదు. కానీ ఆర్టీసీ కష్టాల్లో పడుతుంది. వీటీకి తోడు అమరావతి, పోలవరం పూర్తి ఉండనే ఉన్నాయి.
బాబు ముందు రెండు ఆప్షన్లు ఉన్నాయి. లబ్ధిదారుల గైడ్‌లైన్స్ కఠినతరం చేసి సంఖ్యను బాగా తగ్గించి పథకాలు ఇచ్చామంటే ఇచ్చాం అనిపించుకోవడం. దీని వల్ల నిరసన, అసంతృప్తి పెరుగుతాయి. వైసీపీ ఒక ఆయుధంగా వాడుకుంటుంది. లేదంటే కాలయాపన చేసి ఎన్నికలు వస్తున్నప్పుడు హడావుడి చేయడం.
చెప్పినవి చెప్పినట్టు ఇవ్వాలంటే ఇంకా అప్పులు చేయాలి. కేంద్రం నుంచి భారీగా నిధులు రాబట్టాలి. అప్పులు పుట్టడం కొంచెం కష్టం. ఎందుకంటే నిమ్మకాయ రసం పిండినట్టు జగన్ అప్పుల్ని పిండేసాడు. కేంద్రం నిధులు కొంత వరకు రాబట్ట వచ్చు. అయినా బాబు పథకాలు సాధ్యం కాదు. ఇది చంద్రబాబుకి తెలియక కాదు. ధర్మరాజు కాకపోయినా అశ్వత్థామ హతః తరహా అబద్ధాలు బాబుకి కొత్తకాదు. జగన్‌ని ఓడించే క్రమంలో ఎన్ని అబద్ధాలు చెప్పినా తప్పు లేదని బాబు భావన.
లోకేశ్ విషయానికి వస్తే ఈ ఐదేళ్లు తనని తాను నిరూపించుకోవాలి. బాబు వారసుడిగా తానే కాబోయే ముఖ్యమంత్రి, పార్టీ నంబర్ 1 అని ఫోకస్ కావాలి. చేయాల్సిన పనులు చేయకుండా రెడ్‌బుక్ రాజ్యాంగం జోలికి వెళుతున్నాడు. తండ్రిలా చేతికి మట్టి అంటకుండా చేయడం తెలియదు. జగన్ హయాంలో వివాదాస్పదమైన విద్యాశాఖని దారికి తెస్తే లోకేశ్ ప్రతిభావంతుడని ఒప్పుకోవలసి వుంటుంది.
ఇక పవన్‌కల్యాణ్ నుంచి చడీచప్పుడు లేదు. బాబు అనే మర్రిచెట్టు కింద పవన్ ఎదిగే అవకాశం తక్కువే. సినిమాల్లో అయితే రెండు పాటలు, మూడు ఫైటింగ్‌లతో లాగించేయొచ్చు. రాజకీయాల్లో సాధ్యం కాదు. చాలా తెలుసుకోవాలి, అధ్యయనం చేయాలి. ఆచితూచి మాట్లాడాలి. 36 వేల మంది మహిళల అదృశ్యం గురించి మాట్లాడి చివరికి ఎలా అభాసుపాలు అయ్యాడో మొన్న హోంశాఖ నివేదికలో స్పష్టమైంది.
పరిపాలన అంటే పథకాలు కాదని జగన్ నిరూపించాడు. పథకాలు అమలు చేయకపోయినా పాలన చేయవచ్చని బాబు నిరూపిస్తాడేమో చూడాలి.
The post జగన్‌కి, బాబుకి తేడా ఇదే! appeared first on Great Andhra.