వయనాడ్ బాధితులకు అండగా నిలబడేందుకు టాలీవుడ్ ముందుకొచ్చింది. ఒక్కొక్కరుగా తమకు తోచిన సాయాన్ని ప్రకటిస్తూ, బాధితులకు అండగా నిలుస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, రష్మిక లాంటి వాళ్లు ముందుకురాగా.. రాబోయే రోజుల్లో మరింత మంది టాలీవుడ్ ప్రముఖులు విరాళాలు ప్రకటించబోతున్నారు.
వయనాడ్ దుర్ఘటనకు చలించిపోయిన చిరంజీవి, కొడుకు రామ్ చరణ్ తో కలిసి కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపాయలు విరాళం అందించారు. అంతకంటే ముందు అల్లు అర్జున్ 25 లక్షల రూపాయల సహాయాన్ని ప్రకటించాడు. రష్మిక, నాగవంశీ లాంటి వాళ్లు కూడా విరాళాలు ప్రకటించారు.
వయనాడ్ కు అండగా నిలిచేందుకు పరిశ్రమలన్నీ కదిలి వస్తున్నాయి. కోలీవుడ్ నుంచి ఇప్పటికే సూర్య-కార్తి-జ్యోతిక (రూ. 50 లక్షలు), కమల్ హాసన్ (రూ. 25 లక్షలు), నయనతార-విఘ్నేష్ (రూ. 20 లక్షలు), విక్రమ్ (రూ. 20లక్షలు) లాంటి ఎంతోమంది స్టార్స్ సహాయం అందిస్తున్నారు.
అటు మలయాళ చిత్ర సీమ నుంచి కూడా భారీగా విరాళాలు అందుతున్నాయి. మోహన్ లాల్ 3 కోట్ల రూపాయల సహాయాన్ని అందించగా.. మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్, ఫహాద్ ఫాజిల్, నజ్రియా లాంటి ఎంతోమంది తమకు తోచిన రీతిలో సహాయాన్ని అందిస్తున్నారు.
360 దాటిన మృతుల సంఖ్య.. అటు వయనాడ్ లో వరుసగా 6వ రోజు సహాయక చర్యలు సాగుతున్నాయి. మట్టిని తవ్వే కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. మృతుల సంఖ్య 200 లోపే ఉంటుందని వేసిన అంచనా ఎప్పుడో కొట్టుకుపోయింది. తాజాగా మృతుల సంఖ్య 362కు చేరింది. ప్రతి గంటకు ఓ మృతదేహం లభ్యమౌతోంది.
మొత్తం ప్రభావిత ప్రాంతాన్ని 6 జోన్లుగా విభజించి, సైన్యం సహాయక చర్యలు చేస్తోంది. మట్టిదిబ్బల కింద ఎవరైనా ఉన్నారేమో తెలుసుకునేందుకు అత్యాధునిక సెన్సార్ డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. ఘటన తీవ్రత ఎక్కువగా ఉన్న ముండక్కైలో 540 ఇళ్లు ధ్వంసమైనట్టు ఇప్పటివరకు అందిన నివేదికలో వెల్లడించారు.