తెలుగు సాహిత్యం కొత్త రెక్కలు తొడుక్కుంది. గత పాతికేళ్లలో ఎప్పుడూ లేనంతగా యువ రచయితలు కొత్త ఉత్సాహంతో పుస్తకాలు ప్రచురిస్తున్నారు. గతంలో ఒక తెలుగు పుస్తకం వెయ్యి కాపీలు అమ్ముడైతే గొప్ప అనుకునే రోజులనుంచి, ఇవాళ ఒక మంచి పుస్తకం వస్తే వారం పది రోజుల్లోనే వెయ్యికాపీలు అమ్ముడై రెండవ ముద్రణకి వెళ్తోంది. ఈ మధ్య వచ్చిన కొన్ని తెలుగు పుస్తకాలైతే ఆమెజాన్, ఫ్లిప్ కార్ట్ లాంటి ఆన్ లైన్ షాపింగ్ సైట్స్ లో నేషనల్ బెస్ట్ సెల్లర్స్ గా నిలిచాయి. గత ఐదేళ్లలో పాఠకుల సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. దీనంతటి వెనుక అన్వీక్షికి ప్రచురణ కర్తల అపారమైన కృషి ఉంది. 2019లో మొదలు పెట్టిన ఆన్వీక్షికి ప్రచురణ సంస్థ ఐదేళ్లలో దాదాపు 150 పుస్తకాలు ప్రచురించి, యాభైకి పైగా నూతన రచయితలను తయారు చేసింది. ఈ మధ్యకాలంలో ఆన్వీక్షికి నుంచి వచ్చిన రచయితలు కేంద్రసాహిత్య ఎకాడమీ ఆవార్డులు కూడా అందుకున్నారు. ఆన్వీక్షికి నిర్వాహుకులైన వెంకట్, మహీ, సంజయ్ చదువు అనే ఈ బుక్, ఆడియో బుక్ యాప్ కూడా తయారు చేసి, ప్రపంచంలో ఏ మూల ఉన్న తెలుగు వారికైనా ఒక క్లిక్ తో తెలుగు సాహిత్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. వీరు చేస్తున్న ఈ కృషిని మరింత ముందుకు తీసుకెళ్ళి గత సంవత్సరంలో ఉగాది నవలలపోటి నిర్వహించారు. ఆరు లక్షల ప్రైజ్ మనీతో, మూడు విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో దాదాపు నూట యాభై మంది పాల్గొనగా, 28 నవలలను ఎంపిక చేసి, ఆరు నెలల్లో ఈ నవలలన్నింటినీ పాఠకులకు అందుబాటులోకి తేనున్నారు. తెలుగు సాహిత్యం నవల అనే ప్రక్రియను గత పాతికేళ్లగా దూరం చేసుకుంది కాబట్టే పాఠకులను కూడా కోల్పోయిందనీ ఆన్వీక్షికి, చదువు నిర్వాహకుడు వెంకట్ సిద్దారెడ్డి అభిప్రాయపడ్డారు. ఇప్పుడు వస్తున్న ఈ నవలలతో తెలుగు సాహిత్యం పూర్వ వైభవాన్ని తీసుకొస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో తణికెళ్ల భరణి మాట్లాడుతూ, ఐదేళ్ల క్రితం ఆన్వీక్షికి ప్రచురించిన కొన్ని పుస్తక ఆవిష్కరణలో పాల్గొనడమే కాకుండా, నా పుస్తకం ‘ఎందరో మహానుభావులు,’ ఇంగ్లీష్ అనువాదం కూడా ఆన్వీక్షికి ద్వారా ప్రచురింపబడింది. తెలుగులో పుస్తకాలు కొనేవాళ్ల పూర్తిగా లేరని అనుకునే పరిస్థితి నుంచి, ఒక పుస్తకం వేస్తే నెల రోజుల్లోనే వెయ్యి కాపీలు అమ్మడమే కాకుండా, ఇవాళ ఇంత పెద్ద ఎత్తున అవార్డ్ కార్యక్రమం నిర్వహించడం చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది అన్నారు.
ప్రముఖ దర్శకుడు వంశీ మాట్లాడుతూ, “ఒక నవలతోనే నా సాహిత్య ప్రస్థానం మొదలైంది, ఒక మంచి నవల సినిమాగా మారే అవకాశం ఎక్కువగా ఉంది. గతంలో ఇలాంటి చాలా ప్రయత్నాలు జరిగాయి. సినిమా, సాహిత్యం వేరు వేరు దారుల్లో ప్రయాణిస్తున్న ఈ సమయంలో ఆన్వీక్షికి ద్వారా జరుగుతున్న ఈ ప్రయత్నం అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది,” అని అభిప్రాయ పడ్డారు.
దేవ కట్టా మాట్లాడుతూ,”తెలుగులో చాలామంది దర్శకులు తప్పనిసరి పరిస్ఠితుల్లో తమ కథలు తామే రాసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. సాహిత్యం-సినిమా చేతిలో చేయి వేసుకుని నడిచిన చోట అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఎందుకో తెలియదు కానీ గత రెండు మూడు దశాబ్దాలుగా ఈ రెండు ప్రక్రియలు వేరు కావడం కొంత బాధ కలిగించే విషయం. కానీ ఈ రోజు ఆన్వీక్షికి-చదువు నిర్వహించిన నవలలపోటీ ద్వారా ఆ దూరం దగ్గర కాబోతుందనే ఆశ కలుగుతోంది,” అన్నారు.
ఈ ఆదివారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగిన బహుమతి ప్రధానోత్సవంలో ప్రముఖ దర్శకుడు వంశీ, తనికెళ్ళ భరణి, దేవకట్టాతో పాటు, ఖదీర్ బాబు, మధరాంతకం నరేంద్ర పాల్గొన్నారు. ఈ పోటీలో మొదటి బహుమతి అందుకున్న కడలి సత్యనారాయణ, బూడూరి సుదర్శన్ తమ మొదటి పుస్తకాలను ఆన్వీక్షికి ద్వారా ప్రచురించారు. ఇవాళ అదే సంస్థ నిర్వహించిన నవలలపోటీలో మొదటి బహుమతి గెలుపొందడం సంతోషంగా ఉందని తెలిపారు.