విశాఖలో స్థానిక ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వేడి మొదలైంది. తమకు 600, కూటమికి కేవలం 200 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల బలం వుందని, పోటీ ఎలా పెడతారని వైసీపీ ప్రశ్నిస్తోంది. అలాగే ఓటుకు రేటు కడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శలు చేయడం ప్రాధాన్యం సంతరించకుంది. ఎన్నికలంటేనే బేరాలనే సంగతి అందరికీ తెలిసిందే.
అధికారంలో ఉన్న పార్టీ సహజంగానే గెలుపే ధ్యేయంగా ఎంత డబ్బు అయినా ఖర్చు పెట్టడానికి వెనుకాడదు. విశాఖలో స్థానిక ఎమ్మెల్సీ పోరు బరిలో అభ్యర్థిని నిలబెట్టాలని నిర్ణయించడంతో సహజంగానే రాజకీయం రంజుగా మారింది. వైసీపీ నేతలు చెబుతున్నట్టు ఆ పార్టీకి స్థానిక సంస్థల్లో మంచి బలమే వుంది. కానీ పార్టీకి నిబద్ధతగా పని చేసేవాళ్లు ఎందరనేదే ఇప్పుడు ప్రశ్న. అవకాశవాద రాజకీయాలు రాజ్యమేలుతున్న తరుణంలో మాజీ మంత్రి బొత్స చెబుతున్న గౌరవం లాంటి ఉన్నతాశయాలు పని చేస్తాయా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఇవాళ నర్సీపట్న నియోజకవర్గ ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో బొత్స మాట్లాడుతూ డబ్బుతో ఓట్లు కొనాలని చంద్రబాబు చూస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదని ఆయన చెప్పుకొచ్చారు. ప్రజాస్వామ్యాన్ని నమ్మిన వ్యక్తి వైఎస్ జగన్ అయితే, ఖూనీ చేసిన నాయకుడు చంద్రబాబు అని బొత్స ఘాటు విమర్శలు చేశారు.
ఎవరెన్ని చెప్పినా అంతిమంగా ప్రజాప్రతినిధులు కోరుకునేది డబ్బు మాత్రమే అని అందరికీ తెలుసు. ఆ విషయం కాకుండా, నీతులు గురించి చెబితే పట్టించుకునే పరిస్థితి వుండదు. ఆ కోణంలో బొత్స ఆలోచిస్తేనే వైసీపీ అభ్యర్థిగా గెలుపొందుతారు. ఆత్మగౌరవం, నిబద్ధత, నిజాయితీ అని సూక్తులు చెబితే, ఫైనల్గా ఫలితం ఎలా వుంటుందో బొత్సకు తెలియంది కాదు.
నిజంగా విశాఖలో వైసీపీ గెలవాలని అనుకుంటే, కూటమికి కొనుగోలు అవకాశం లేకుండా, స్థానిక ప్రజాప్రతినిధుల కోరికల్ని తీర్చడం ఒక్కటే మిగిలింది. రాజకీయాల్లో ఇంతకంటే చెప్పుకోడానికి ఏమీ మిగల్లేదు. నీతులకు ఓట్లు రాలే కాలం పోయింది.
The post బొత్సా… నీతులకు ఓట్లు రాలుతాయా! appeared first on Great Andhra.