టాలీవుడ్ మీద ఆధారపడిన థియేటర్ల పరిశ్రమ గడ్డు పరిస్థితిలో చిక్కుకుంది. ఈ ఏడాది మొత్తం మీద అరడజను సినిమాలు మాత్రమే థియేటర్లను ఆదుకున్నాయి. వస్తే ఒకేసారి రావడం లేదంటే ఖాళీగా వదిలేయడం లాంటి విధానాల వల్ల థియేటర్లకు సినిమాలు కరువైపోతున్నాయి. కల్కి విడుదలైన మూడు వారాల తరువాత థియేటర్ల పరిస్థితి మళ్లీ ఘోరంగా తయారైంది. ఒక థియేటర్ రన్ చేయాలంటే నెలకు కనీసం అయిదు లక్షలు అవసరం. ఆ మేరకు షేర్ అన్నా రావాలి లేదా రెంట్ అన్నా రావాలి. చిన్న సినిమాలు రెంట్ మీద ఆడే పరిస్థితి లేదు. సినిమా ఇస్తే చాలు అన్నట్లు వుంది.
కానీ ఆ సినిమాలకు జనాలు థియేటర్ కు రావడం లేదు. పెద్ద సినిమాలు వస్తే రెంట్ వస్తుంది. క్యాంటీన్, పార్కింగ్ డబ్బులు వస్తాయి. జనవరి తరువాత అలా థియేటర్ల ఆకలి తీర్చిన సినిమాలు రెండు మూడు మాత్రమే. టిల్లు, కల్కి ఇలా ఒక చేతి వేళ్ల మీద లెక్క పెట్టేవే. అంటే ఆరు నెలల్లో రెండు మూడు సినిమాలు అంటే థియేటర్ల పరిస్థితి ఊహించుకోవచ్చు.
చాలా చోట్ల కల్కి కి ముందు థియేటర్లు మూత పెట్టారు. కరెంట్ బిల్లులు కట్టక ఫీజులు పట్టుకుపోయారు. కల్కి టైమ్ లో బిల్లులు చెల్లించి, మళ్లీ థియేటర్లు తెరిచారు. కల్కి తరువాత మళ్లీ పరిస్థితి అలాగే తయారైంది.
థియేటర్ల పరిస్థితికి విడుదల డేట్ లు కూడా ఓ కారణం. ఒకేసారి రెండు మూడు సినిమాలు రావడం. లేదంటే ఖాళీగా వదిలేయడం. ఈ నెల 9 కమిటీ కుర్రాళ్లు, తుపాన్ అనే డబ్బింగ్ సినిమా వస్తున్నాయి. బచ్చన్, ఇస్మార్ట్ రెండు సినిమాలు 15 నే ఎంచుకున్నాయి తప్ప, ఒక సినిమా అయినా ఇటు రాలేదు. దీనికి కారణం వర్క్ కు టైమ్ సరిపోకపోవడం. ఎందుకలా? అంటే లాస్ట్ మినిట్ వరకు ఓటిటి డీల్స్ క్లోజ్ కావడం లేదు. తీరా క్లోజ్ అయిన తరువాత వాళ్లు చెప్పిన టైమ్ స్లాట్ కు అనుగుణంగా విడుదల తేదీ ఎంచుకోవాల్సి వస్తోంది. అలాంటపుడు నిర్మాత చేతుల్లో ఏమీ వుండడం లేదు.
ఓటిటి చేతుల్లోకి టాలీవుడ్ దాదాపుగా వెళ్లిపోయినట్లే. పైకి ఎన్ని కబుర్లు చెప్పినా విడుదల అన్నది చాలా వరకు ఓటిటి లెక్కల ప్రకారమే వుంటోంది. అదే సమయంలో చిన్న సినిమాను థియేటర్ ఆదరించడం అన్నది చాలా రేర్ ఫీట్ అయిపోయింది. ఇటీవల అలాంటి ఆదరణ మహరాజా అనే ఒక్క సినిమాకు దక్కింది.
చాలా చిన్న సినిమాలకు కనీసం ప్రీరిలీజ్ ఫంక్షన్ ఖర్చులు కూడా రావడం లేదు అంటే అతిశయోక్తి లేదు. పబ్లిసిటీ లోపం వుందా అంటే అస్సలు లేదు. జనం పబ్లిసిటీని పట్టించుకుంటున్నారు. ఎంటర్ టైన్ అవుతున్నారు. కానీ థియేటర్ కు మాత్రం రావడం లేదు.
చిన్న, మీడియం సినిమాల వరకు థియేటర్ వెళ్లి చూడాల్సిన హీరో, హీరోయిన్, నటులు అంతా సినిమా విడుదలకు ముందే రకరకాల విన్యాసాల ద్వారా యూ ట్యూబ్ లోనే అలరించేస్తున్నారు. వివిధ టీవీ షోలు, షార్ట్ లు, ఇంటర్వూలు ఇలా. ఇవన్నీ ఎంటర్ టైన్ చేస్తున్నారు. జనం ఎంటర్ టైన్ అవుతున్నారు. ఇక థియేటర్ కు వాళ్లని చూడ్డానికి వెళ్లక్కరలేదు. కేవలం కంటెంట్ కోసం వెళ్లాలి. ఆ కంటెంట్ ను ఓటిటిలో చూస్తే చాల్లే అనుకుంటున్నారు. అందువల్ల చిన్న, మీడియం సినిమా ప్రచారం సినిమా వస్తోంది అని తెలియచేస్తోంది తప్ప థియేటర్ కు జనాల్ని రప్పించడం లేదు. ఆ పబ్లిసిటీ అంతా ఓటిటికి పనికి వస్తోంది. పెద్ద సినిమాల వరకు వస్తే పెద్ద హీరోలు వుంటారు కనుక, వాళ్ల కోసం థియేటర్ కు వెళ్తున్నారు.
ఈ పరిస్థితి వల్ల థియేటర్ల మనుగడ ప్రశ్నార్ధకం అవుతోంది. పాన్ ఇండియా, భారీ సినిమాలు ఒక్కసారిగా టాలీవుడ్ లో స్టార్ట్ అయ్యాయి. మనకు వున్న టాప్ హీరోలు అంతా పాన్ ఇండియాలు, సీక్వెళ్లు తలకు ఎత్తుకున్నారు. మిడ్ రేంజ్ హీరోలకు సరైన సబ్జెట్‌లు పడడం లేదు. ఫ్లాపులు పలకరిస్తున్నాయి. దాంతో క్రేజ్ తగ్గుతోంది. అందువల్ల థియేటర్ కు వెళ్లి మిడ్ రేంజ్ హీరోలను చూడాలన్న మూడ్ పోతోంది. టాలీవుడ్ లో ఇప్పుడు చూస్తే..
రామ్ చరణ్ అమెరికాలో వున్నారు. ప్రభాస్ యూరప్ లో వున్నారు. బన్నీ రెస్ట్ లో వున్నారు. మహేష్ వెయిటింగ్ లో వున్నారు. పవన్ డిప్యూటీ సిఎమ్ అయిపోయారు.
ఇంక ఎంత మంది మిగిలారు?
తేజ్ లు, శర్వానంద్, సుధీర్ బాబు, గోపీచంద్, రామ్, రవితేజ అంతా ఫ్లాప్ లైనప్ తో వున్నారు. రాబోయే సినిమాలు హిట్ అయితే అప్పుడు మళ్లీ ఎలా వుంటుందో చూడాలి.
సీనియర్ హీరోలు అంతా ఒక్కో సినిమా సెట్ మీదకు తెచ్చారు. అవన్నీ రావడానికి మరో ఆరు నెలలు పడుతుంది.
అందువల్ల టోటల్ గా సినేరియా చూస్తే, థియేటర్ల గడ్డుకాలం ఇలాగే వుంటుంది. సినిమాలు వచ్చిన వారం, ఆపై వారం హ్యాపీ. తరువాత మళ్లీ మామూలే. ఆగస్టులో మూడు సినిమాలు, సెప్టెంబర్ లో ఒకటి రెండు, అక్టోబర్ లో ఒకటి రెండు, డిసెంబర్ లో ఓ రెండు.. ఇవే థియేటర్లకు మిగిలినవి.
ఈ పరిస్థితి మారితే తప్ప థియేటర్ల కష్టాలు తీరవు. గిల్డ్ లు, ఛాంబర్లు కూడా ఈ పరిస్థితిని చూస్తూ వుండడం తప్ప చేసేది లేదు.