ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి నుంచి రాజకీయ నాయకులు నేర్చుకోవాల్సింది చాలా వుంది. ఎదుటి వాళ్లను ఒప్పించడంలో చంద్రబాబుకు మించినవారెవరూ లేరు. తాజాగా నామినేటెడ్ పదవుల అంశం తెరపైకి వచ్చింది. మరో రెండు వారాల్లో నామినేటెడ్ పదవుల పందేరం జరగనుందని టీడీపీ అనుకూల మీడియా చెబుతోంది.
ఈ నేపథ్యంలో మిత్రపక్షాలైన జనసేన, బీజేపీకి కలిపి 18 నుంచి 20 శాతం పదవులు మాత్రమే ఇవ్వనున్నారట. ఇంత వరకూ రెండు పార్టీలకు కలిపి 40 శాతం నామినేటెడ్ పదవులు ఇస్తారని ప్రచారం జరిగింది. అంత సీన్ లేదు, అందులో సగం ఇస్తే గొప్ప అని టీడీపీ నాయకులు చెబుతున్నారు. గతంలో పవన్‌కల్యాణ్ కూటమి అధికారంలోకి వస్తే నామినేటెడ్ పదవులు పెద్ద సంఖ్యలో తమకు వస్తాయని ఆయన చెబుతూ వచ్చారు.
ఆ సమయం రానే వచ్చింది. రెండు పార్టీలకు కలిపి గరిష్టంగా 20 శాతం నామినేటెడ్ పదవులు ఇస్తారంటే, జనసేనకు అందులో సగం మాత్రమే దక్కే అవకాశం వుంది. ఇంత తక్కువ సంఖ్యలో మిత్రపక్షాలకు ఇవ్వడానికి చంద్రబాబు చాణక్యమే కారణం. ఎమ్మెల్యే, ఎంపీ సీట్లను జనసేనకు తక్కువగా ఇచ్చారు. ఇందుకు పవన్‌కల్యాణ్‌ను ఒప్పించడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. ఇప్పుడు నామినేటెడ్ పదవుల విషయంలో తానిచ్చినన్ని తీసుకునేలా పవన్‌ను బాబు ఒప్పుకునేలా చేయడం విశేషం. తాను చెప్పినదానికల్లా తలూపేలా పవన్‌ను ఏం మాయ చేశావయ్యా అని జనసేన నాయకులు ప్రశ్నిస్తున్నారు.
20 శాతం లోపు అంటే, ఈ లెక్కను బట్టి జనసేనకు దక్కే పదవులు నామమాత్రమే అని చెప్పొచ్చు. మరోవైపు నామినేటెడ్ పదవులపై జనసేన నాయకులు భారీ ఆశలే పెట్టుకున్నారు. ఇప్పుడే దక్కే అవకాశం లేకపోవడంతో జనసేన నాయకులు తీవ్ర నిరాశకు గురయ్యే అవకాశం వుంది. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే ఈ పరిస్థితి తలెత్తితే, రాబోవు రోజుల్లో ఎలా వుంటుందో చూడాలి.