ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనితతో దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత భేటీ అయ్యారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటిసారి సునీత రాష్ట్ర సచివాలయానికి వెళ్లారు. మంత్రి అనితను సునీత కలుసుకున్నారు. తన తండ్రి వివేకా హత్య కేసులో న్యాయం చేయాలని అనితను సునీత కోరినట్టు సమాచారం.
వైఎస్ జగన్ ప్రభుత్వంలో వివేకా హత్య కేసులో ముందుకెళ్లలేదని, న్యాయం జరగలేదని అనితతో సునీత అన్నట్టు చెబుతున్నారు. అలాగే వివేకా హత్య కేసులో నిందితుడైన కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయడానికి గత ప్రభుత్వం అడ్డుగా నిలబడిన విషయాన్ని హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. అలాగే తన భద్రత విషయాన్ని కూడా మంత్రికి వివరించారని సమాచారం.
సునీత వినతిపై హోంమంత్రి అనిత సానుకూలంగా స్పందించారని తెలిసింది. ఇప్పటికే వివేకా హత్య కేసులో నిందితులంతా జైల్లో ఉన్నారు. ఒక్క అవినాష్‌రెడ్డి మాత్రమే బెయిల్‌పై బయట ఉన్నారు.
అవినాష్‌రెడ్డిని ఎలాగైనా జైల్లో పెట్టాలనేది సునీత. ఎన్నికల్లో వైఎస్ అవినాష్‌రెడ్డిని ఓడించాలంటూ షర్మిలతో పాటు సునీత ప్రచారం చేశారు. తన తండ్రిని చంపిన కేసులో అవినాష్‌రెడ్డి ప్రధాన నిందితుడంటూ సునీత తీవ్రంగా ఆరోపించిన సంగతి తెలిసిందే. సునీత పోరాటానికి కొత్త ప్రభుత్వం ఏ మేరకు సహకరిస్తుందో చూడాలి.