బాబాయ్ ఖాతాలో మరో పరాజయం


వైసీపీకి విశాఖ రీజనల్ కో ఆర్డినేటర్ నియమితులైన తరువాత జగన్ సొంత బాబాయ్ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆ పార్టీని గెలిపించలేకపోతున్నారు అన్న విమర్శలు వస్తున్నాయి. ఆయన 2022 ఏప్రిల్ నుంచి విశాఖ పార్టీ వ్యవహారాలు చూస్తున్నారు. ఆయన వచ్చాక స్థానికంగా వైసీపీకి వర్గ పోరు పెరిగింది. నాయకులు ఎవరికి వారుగా ఉంటూ వచ్చారు. ఎవరినీ కో ఆర్డినేట్ చేయలేకపోవడంతో వారంతా సరైన సమయం చూసి ఎన్నికల ముందు వేరే పార్టీలకు వెళ్ళిపోయారు.

మిగిలిన స్థానిక ప్రజా ప్రతినిధులు ఇపుడు తన తడాఖా చూపిస్తున్నారు అని అంటున్నారు. వైవీ సుబ్బారెడ్డి బాధ్యతలు తీసుకున్నాక 2023 మార్చిలో వచ్చిన ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలిసారి వైసీపీకి భారీ దెబ్బ తగిలింది. ఆనాడే పార్టీ పొజిషన్ తెలుసుకుని వ్యవహారాలను చక్కబెట్టి ఉంటే 2024 ఎన్నికల్లో ఎంతో కొంత పరువు నిలిచి ఉండేదని అన్న చర్చ సాగింది.

కానీ ఎవరూ పట్టించుకోలేదు. అలా మొదలైన పరాజయాల ప్రయాణం కాస్తా 2024లో జరిగిన సాధారణ ఎన్నికల్లో పార్టీని పూర్తిగా నేలమట్టం చేసింది. విశాఖ జిల్లా మొత్తం మీద వైసీపీ ఉనికి లేకుండా పోయింది. చాలా చోట్ల బలమైన అభ్యర్థులకు టికెట్లు ఇవ్వలేని పరిస్థితి ఉంది. అలాగే టికెట్లు ఇవ్వని వారిని నచ్చచెప్పలేని నిర్వాకమూ ఉంది.

ఇపుడు చూస్తే స్థాయీ సంఘం ఎన్నికల గురించి చూసినా గత కొంతకాలంగా షెడ్యూల్ వెలువడి కూటమి తన ప్రయత్నాలు గట్టిగా చేస్తున్నా వైసీపీ నుంచి తగిన తీరున ప్రతి వ్యూహాలు రచించే వారు కరవు అయ్యారని అంటున్నారు. కార్పోరేటర్లలో ఉన్న అసంతృప్తిని గమనించినా ఏమి చేయలేక మిన్నకుండిపోయారు అన్న మాట వినిపిస్తోంది.

దాంతో వారంతా కట్టకట్టుకుని సొంత పార్టీని ఓడించేశారు. బలం ఏ మాత్రం లేని కూటమి స్థాయి సంఘం ఎన్నికల్లో మొత్తం సీట్లు గెలిచింది అంటే అందులో వైసీపీ వైఫల్యమే ఎక్కువ అని అంటున్నారు. మేమే గెలుస్తామని బోల్డ్ గా స్టేట్మెంట్స్ ఇవ్వడం తప్ప ఆచరణలో సరైన ప్లాన్ లేకపోవడమే ఈ వరస ఓటములకు కారణం అని అంటున్నారు.

వైవీ సుబ్బారెడ్డిని పార్టీ ప్రక్షాళనలో భాగంగా తప్పిస్తారా లేక ఆయననే కంటిన్యూ చేస్తారా అన్న చర్చ వైసీపీలో సాగుతోంది. ఈ నెల 30న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు చూసిన తరువాతనే మార్పులు ఉండొచ్చు అని అంటున్నారు.

The post బాబాయ్ ఖాతాలో మరో పరాజయం appeared first on Great Andhra.



Source link

Leave a Comment