శీతాకాలంలో జలుబు, దగ్గు, సైనస్ కు చెక్ పెట్టే ఆయుర్వేద చిట్కాలు..!


posted on Jan 11, 2025 9:30AM

 

చలికాలం చాలా రకాల ఆరోగ్య సమస్యలను వెంటబెట్టుకు వస్తుంది. చలిగాలులు, మంచు కారణంగా తొందరగా జలుబు, దగ్గు సమస్యలు వస్తాయి. ఇక ఇప్పటికే సైనస్ సమస్యలు ఉన్నవారు చలికాలం వల్ల చెప్పలేనంత ఇబ్బంది పడతారు. కొందరికి చలి కారణంగా ఛాతీ పట్టేయడం,  ఛాతీలో కఫం పేరుకుపోవడం వంటి సమస్యలు కూడా ఏర్పడతాయి. చలి గాలులు చెవిలోకి వెళ్లి తలనొప్పి కూడా వచ్చేలా చేస్తుంది.   ఈ సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవాలన్నా, వీటి నుండి బయటపడాలన్నా,   ఆయుర్వేదం చెప్పిన కొన్ని చిట్కాలు చాలా బాగా పనిచేస్తాయి.

పసుపు పాలు..

పసుపును కొన్ని వందల సంవత్సరాలుగా ఆయుర్వేదంలో వివిధ సమస్యల  నివారణకు ఉపయోగిస్తున్నారు.  పసుపులో శక్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.  కొద్దిగా పసుపును పాలలో వేసి మరిగించాలి.  ఇందులో రుచి కోసం అల్లం, మిరియాలు కూడా వేసుకోవచ్చు.  ఈ పసుపు పాలను తాగడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది.  జలుబు కారణంగా ఏర్పడిన ముక్కుల రద్దీని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.

హనీ, జింజర్ టీ..

అల్లం, తేనె రెండూ ఆయుర్వేదంలో మంచి ఔషధాలు.  రోగనిరోధక శక్తిని పెంచడంలో అల్లం, తేనె పని చేస్తాయి. అల్లాన్ని దంచి లేదా సన్నని ముక్కలుగా కట్ చేసి నీటిలో వేసి మరిగించాలి.  మరిగిన తరువాత గోరు వెచ్చగా ఉన్నప్పుడు అందులో ఒక స్పూన్ తేనె కలిపి తాగాలి. తేనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు గొంతుకు మంచి  ఉపశమనం ఇస్తాయి. అల్లం శ్వాస కోశ సమస్యలు తగ్గించడంలో సహాయపడుతుంది.

ఆవిరి..

ఆవిరి పట్టడం చాలా మంచి టిప్.  జలుబు, దగ్గు, ముక్కులు మూసుకుపోవడం, తల నొప్పి, తల భారం వంటి సమస్యలు ఉన్నప్పుడు ఒక గిన్నెలో నీటిని బాగా మరిగించాలి.  బాగా వేడెక్కిన నీటిలో కొన్ని చుక్కల నీలగిరి తైలం వేసుకుని నీటి ఆవిరి పట్టాలి. ఇది తల భారం తగ్గిస్తుంది,  ముక్కల రద్దీని తగ్గిస్తుంది. శ్వాస నాళాలను క్లియర్ చేస్తుంది.

పుక్కిలించడం..

గోరు వెచ్చని నీటితో పుక్కిలించడం కూడా మంచి మార్గం.  గోరు వెచ్చని నీటిలో కాసింత ఉప్పు వేయాలి.  ఈ నీటిని నోట్లో పోసుకుని బాగా పుక్కిలించాలి. నీరు గొంతును క్లీన్ చేసేలా పుక్కిలించాలి.  ఇది నోట్లో, గొంతులో ఉండే బ్యాక్టీరియాను క్లియర్ చేస్తుంది.

నాసల్ డ్రాప్స్..

ఆయుర్వేదంలో నాసల్ డ్రాప్స్ ఉన్నాయి.   దీన్ని అను తైలం అని పిలుస్తారు. ఈ తైలాన్ని కొన్ని చుక్కలు ముక్కులలో వేసుకోవడం వల్ల ముక్కుల రద్దీ తగ్గుతుంది.  సాధారణంగా ఏ టిప్ వాడినా ముక్కులు తాత్కాలికంగా రిలీఫ్ అయ్యి తరువాత మళ్లీ రద్దీ అవుతాయి. కానీ ఈ తైలాన్ని కొన్ని చుక్కలు ముక్కులలో వేసుకుంటే ఈ సమస్య తగ్గుతుంది.


హెర్బల్ టీ..

  నల్ల మిరియాలు, అతి మధురం,  తులసి వంటి ఆయుర్వేద మూలికలతో చేసిన హెర్బల్ టీని తయారు చేసుకుని ఈ చలికాలంలో తీసుకుంటే భలే పనిచేస్తుంది.  ఇది దగ్గు, జలుబు,  రద్దీగా ఉన్న ముక్కులను తెరవడం, దగ్గు, కఫం సమస్యను తగ్గించడం చేస్తుంది.


                                                  *రూపశ్రీ.



Source link

Leave a Comment