posted on Jan 11, 2025 9:30AM
సంక్రాంతి భారతీయులు జురుపుకునే ముఖ్యమైన పండుగలలో ఒకటి. ఇది ప్రముఖంగా రైతుల పండుగ. క్రాంతి అంటే స్వేచ్ఛ, స్వాతంత్ర్యం. సంక్రాంతి అంటే.. కొత్త క్రాంతి.. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడంతో వెలుగులీనుతాడు. క్రమంగా తన వెలుగును పెంచుకుంటూ వెళతారు. సూర్యుడిలానే ప్రజలు కూడా కొత్త కాంతితో తమ జీవితాలలో ముందుకు సాగాలన్నదే సంక్రాంతి సందేశం. సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది. సూర్యుడి కాంతి ద్వారా భూమి వెలుగులో సంచరిస్తుంది. ఉత్తరాయణం ప్రారంభం అయితే సూర్యుడి గమనం వేగం అవుతుంది. సూర్యుడి గమనం వల్లనే ఈ ప్రపంచం ఇలా ఉంది. సూర్యుడి గమనం లేకపోతే ఈ ప్రపంచం అంధకారం అవుతుంది. అందుకే సూర్యుడి విలువను, సూర్య కాంతి విలువను అర్థం చేసుకోవాలి.
సంక్రాంతి అంటే ‘పరివర్తనం’ అని అర్థం. మకర సంక్రాంతి రోజున ‘మహా-స్నాన-యోగం’ జరుగుతుందట. నదులు, సరస్సులలో ముఖ్యంగా పవిత్ర నదుల సంగమం వద్ద స్నానం చేయడం చాలా మంచిది. మకర సంక్రాంతి పంటల పండుగ కూడా. శీతాకాలం తగ్గుముఖం పడుతుంది. ముఖ్యంగా నువ్వులతో చేసిన సాంప్రదాయ స్వీట్లు సంక్రాంతి ప్రత్యేకం. పొంగలి కూడా సంక్రాంతి ప్రత్యేక వంటకం. దీని పేరు మీదనే ఈ పండుగకు పొంగల్ అనే పేరు కూడా వచ్చింది.
సంక్రాంతి పండుగ పంటల పండుగ. పంటలు పండాలంటే ఆ సూర్య రశ్మి చాలా అవసరం. ఈ కారణంగానే రైతులతో పాటు దేశం యావత్తూ సూర్యుజిని సంక్రాంతి పండుగ సందర్భంగా ఆరాధిస్తుంది. ఉత్తరాయం ప్రారంభానికి సూచనగా, సూర్యుడి గమనానికి ప్రాధాన్యత ఇస్తూ రథం ముగ్గులు వేస్తారు.
సంక్రాంతి పండుగ రోజు సూర్య భగవానుడి అనుగ్రహం పొందాలంటే.. సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. అది కూడా నీరు పారే ప్రాంతాలు, నదులలో అర్ఘ్యం సమర్పించడం మంచిది. ఏ నదిలో స్నానం చేసి అర్ఘ్యం సమర్పిస్తారో.. ఆ నదీ దేవతకు ప్రార్థిస్తూ అర్ఘ్యం సమర్పించాలి.
సంక్రాంతి పండుగ రోజున సన్యాసులు, పేదలకు దానం చేయడం మంచిది. అలాగే ఈ పండుగ రోజు వండే వంటల్లో ఉల్లి వెల్లుల్లిపాయలను అస్సలు తినకూడదు.
*రూపశ్రీ.